
వేములవాడ/గోదావరిఖని/చొప్పదండి, వెలుగు : ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్యేల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణాల్లో 200కోట్ల టికెట్లు పూర్తయిన సందర్భంగా బుధవారం వేములవాడ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన మహిళలను, విద్యార్థులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తొలినాళ్లలో మహిళలను అవమానపరిచేలా మాట్లాడిన కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పటికైనా ఈ పథకాన్ని స్వాగతించి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి సంబురాల్లో భాగంగా చొప్పదండి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో నిర్వహించిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకాన్ని బీఆర్‌ఎస్ లీడర్లు హరీశ్‌రావు, కేటీఆర్ జీర్ణించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన సంబురాల్లో ఆయన పాల్గొని మహిళా కండక్టర్లు, ప్యాసింజర్లకు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్రాజ్ఠాకూర్బహుమతులు అందజేశారు.
ఉచిత ప్రయాణంతో మహిళలకు అసలైన గౌరవం
కరీంనగర్ టౌన్/కోరుట్ల, వెలుగు: మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వారికి దక్కిన అసలైన కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన సంబురాల్లో సీపీ గౌస్ ఆలంతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం విద్యార్థులు, మహిళా చిరు ఉద్యోగులు, కూలీలకు ఆర్థిక వెసులుబాటు కలిగిందన్నారు. కరీంనగర్ రీజియన్ లో మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 4.83 కోట్ల మంది ప్రయాణాలు చేశారని, దీంతో రూ.201.82 కోట్ల లబ్ది చేకూరిందని తెలిపారు.
అనంతరం వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఆర్టీసీ ఆఫీసర్లు, సీపీతో కలిసి కలెక్టర్ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాలు, ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసుల నమోదు పురోగతిపై కలెక్టరేట్ రివ్యూ నిర్వహించారు. కోరుట్ల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన సంబురాల్లో ఆర్డీవో జివాకర్ రెడ్డి హాజరై విద్యార్థులు, కూరగాయలు అమ్మే మహిళలను సత్కరించి బహుమతులు అందజేశారు.