
98 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా చిత్తు
క్రెయిన్స్: స్పిన్నర్ కేశవ్ మహారాజ్ (5/33) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో విజృంభించడంతో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 98 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సఫారీ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 296/-8 స్కోరు చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ (82), కెప్టెన్ టెంబా బవూమ (65), మాథ్యూ బ్రెట్జ్‌కీ (57) ఫిఫ్టీలతో సత్తా చాటారు. ర్యాన్ రికెల్టన్ (33), వియాన్ ముల్డర్ (31) కూడా ఆకట్టుకున్నారు.
కంగారూ టీమ్ బౌలర్లలో ట్రావిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బెన్ డ్వారిషస్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో కేశవ్ స్పిన్ వలలో చిక్కుకొని విలవిలలాడిన ఆసీస్ 40.5 ఓవర్లలో 198 రన్స్‌కే కుప్పకూలి చిత్తుగా ఓడింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒంటరి పోరాటం చేశాడు. ట్రావిస్ హెడ్ (27)తో కలిసి తొలి వికెట్‌కు 60 రన్స్ జోడించి మంచి ఆరంభం ఇచ్చినా.. కేశవ్ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ డీలా పడింది. తన 4.2 ఓవర్లలో లబుషేన్ (1), గ్రీన్ (3), ఇంగ్లిస్ (5), క్యారీ (0), ఆరోన్ హార్డీ (4) ఐదుగురినీ సింగిల్ డిజిట్‌కే పరిమితం చేసిన సఫారీ స్పిన్నర్ కేశవ్ ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. చివర్లో డ్వారిషస్ (33) కాస్త ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. నాండ్రి బర్గర్, లుంగి ఎంగిడి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కేశవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం మకేలో జరుగుతుంది.