ఇవాళ ఇండియా కూటమి మహార్యాలీ.. హాజరుకానున్న ఖర్గే, రాహుల్

ఇవాళ ఇండియా కూటమి మహార్యాలీ.. హాజరుకానున్న ఖర్గే, రాహుల్

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మహార్యాలీ నిర్వహించనుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో ‘లోక్ తంత్ర బచావో ర్యాలీ’ ఏర్పాటు చేసింది. ర్యాలీ వివరాలను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘ఇది ఒక వ్యక్తి కోసం, ఒక పార్టీ కోసం ఏర్పాటు చేసిన ర్యాలీ కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ‘లోక్ తంత్ర బచావో ర్యాలీ’ నిర్వహించాలని నిర్ణయించాం. 

ఇందులో 27 నుంచి 28 పార్టీలు పాల్గొంటాయి. కాంగ్రెస్ పార్టీ చీఫ్​మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్​ రాహుల్ గాంధీ హాజరవుతారు” అని తెలిపారు. కాగా, ఈ ర్యాలీకి పంజాబ్ నుంచి లక్ష మందికి పైగా తరలి వస్తారని ఆశిస్తున్నామని ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు పేర్కొన్నారు. ర్యాలీకి 1.25 లక్షల మందిని తరలించాలని టార్గెట్ పెట్టుకున్నామని ఆప్ ​పంజాబ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుధ్ రామ్ తెలిపారు. మరోవైపు, ప్రతిపక్షాల ర్యాలీ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు, పలుచోట్ల రోడ్లను మూసివేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.