నేటి నుంచి మహా అసెంబ్లీ.. 10 మందికి పాజిటివ్

నేటి నుంచి మహా అసెంబ్లీ.. 10 మందికి పాజిటివ్

మహారాష్ట్రలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. ఈ క్రమంలో అక్కడ ఇవాల్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో అసెంబ్లీకి వచ్చే వారందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే వీరిలో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్‌ సోకిన వారిలో ఎనిమిది మంది పోలీసులతోపాటు ఇద్దరు అసెంబ్లీ సిబ్బంది ఉన్నారు. దీంతో అక్కడున్న అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు.  అసెంబ్లీకి హాజరయిన వారికి మరింత కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  అయితే ఏ జర్నలిస్ట్‌ గానీ, ఎమ్మెల్యేల గానీ కోవిడ్‌ బారిన పడలేదు.  

ఇదిలా ఉండగా.. రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. అందులో శని, ఆదివారాలు సెలవులు పోను మిగతా ఐదు రోజుల్లో సభా కార్యకలాపాలు కొనసాగుతాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ కమిటీ ఏర్పాట్లను సైతం పూర్తిచేసింది. మరోవైపు, ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఈసారి స్పీకర్‌ను రహస్య ఓటింగ్‌తో కాకుండా మూజువాణి ఓటు పద్ధతిలో ఎన్నుకోవాలని మహావికాస్‌ ఆఘాడి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 23వ తేదీ లేదా 24వ తేదీన స్పీకర్‌ ఎన్నికను ప్రకటించి ఒకే రోజులో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మెడ ఆపరేషన్‌ తరువాత మొదటిసారి ఈ సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి:

ఈ జీప్ కిక్ కొడితే స్టార్ట్ అయితది

పార్లమెంట్ ప్రొసీడింగ్స్​ను లైవ్​లోచూసేందుకు యాప్