ల‌క్ష మంది వ‌ల‌స కార్మికులు ఊరెళ్లేందుకు మ‌హా స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్

ల‌క్ష మంది వ‌ల‌స కార్మికులు ఊరెళ్లేందుకు మ‌హా స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్

లాక్ డౌన్ తో చిక్కుకుపోయిన ల‌క్ష మందికి పైగా వ‌ల‌స కార్మికులను వారి స్వ‌స్థ‌లాల‌కు పంపేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల‌కు చెందిన కార్మికులు వేర్వేరు ప్రాంతాల్లోని 38 షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల్లో ప‌ని చేస్తున్నారు. లాక్ డౌన్ తో ప‌నులు నిలిచిపోవ‌డం, ర‌వాణా సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో ఆ ఫ్యాక్ట‌రీలే తాత్కాలిక షెల్ట‌ర్లు ఏర్పాటు చేసి భోజ‌న స‌దుపాయం క‌ల్పించింది. ఇటీవ‌ల‌ వ‌ల‌స కార్మికులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్తామంటూ నిర‌స‌న‌ల‌కు దిగుతున్న‌ నేప‌థ్యంలో వారిని త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం.

గుడ్ న్యూస్ అంటూ ట్వీట్

షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల్లో ప‌ని చేసే సుమారు ల‌క్షా 31 వేల మంది కార్మికుల‌ను వారి సొంత జిల్లాల‌కు పంపేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు ఆ రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధ‌నంజ‌య్ ముండే. వారికి టెస్టులు చేసి సొంత ఊర్ల‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం దాదాపు ల‌క్షా 30 వేల మంది కార్మికుల‌కు 38 చెరుకు ఫ్యాక్ట‌రీలు త‌మ‌ ఆవ‌ర‌ణ‌లోనే తాత్కాలిక షెల్ట‌ర్లలో వ‌స‌తి, భోజ‌నం ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. షుగ‌ర్ కేన్ వ‌ర్క‌ర్ల‌కు గుడ్ న్యూస్ అంటూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. సొంత గ్రామాల‌కు పంపుతున్నామ‌ని, అయితే ఊరికి వెళ్లాక త‌మ ఆరోగ్యంతో పాటు గ్రామంలోని వారి ఆరోగ్యంగా కూడా జాగ్ర‌త్త‌గా చూసుకునేందుకు స‌హ‌క‌రించాల‌ని, అంతా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని సూచించారు.

కార్మికుల‌కు ఫ్యాక్ట‌రీ ఓన‌ర్లే టెస్టులు చేయించాలి

షుగ‌ర్ ఫ్యాక్ట‌రీల కార్మికుల‌కు ఓన‌ర్లే టెస్టులు చేయించి, ఆ రిపోర్టుల‌ను అంద‌జేసి వారి ప్ర‌యాణానికి అనుమ‌తి తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స‌ర్క్యూల‌ర్ జారీ చేసింది. టెస్టు రిపోర్టుల్లో నెగ‌టివ్ వ‌స్తే వారికి ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం నాడు వేలాది వ‌ల‌స కార్మికులు తాము స్వ‌స్థ‌లాల‌కు వెళ్తామంటూ ముంబైలో రోడ్ల‌పైకి వ‌చ్చిన నిర‌స‌న‌ల‌కు దిగిన నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకోవడంతో ప్రాధాన్యం నెల‌కొంది. కాగా, దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లోనే 3323 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 201 మంది మ‌ర‌ణించారు. దేశ వ్యాప్తంగా క‌రోనా బారిన‌ప‌డిన వారి సంఖ్య 14378కి చేర‌గా.. వారిలో 480 మంది మ‌ర‌ణించారు. పూర్తిగా కోలుకుని 1992 మంది ఆస్ప‌త్రుల‌ను నుంచి డిశ్చార్జ్ అయ్యారు.