కూలిన బిల్డింగ్ కింద 19 గంటలు చిక్కుకున్న చిన్నోడు బతికిండి

కూలిన బిల్డింగ్ కింద 19 గంటలు చిక్కుకున్న చిన్నోడు బతికిండి

నాలుగేళ్ల బాబును క్షేమంగా బయటకు తెచ్చిన రెస్క్యూ టీమ్
మహాద్ ప్రమాదంలో 13 కు చేరిన మృతుల సంఖ్య
కొనసాగుతున్న సహాయక చర్యలు
60 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్
క్వాలిటీ లేకుండా బిల్డింగ్ కట్టిన బిల్డర్: రెసిడెంట్లు

రాయిగఢ్ (మహారాష్ట్ర ): ఐదంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 19 గంటలకు పైగా శిథిలాల కింద చిక్కుకుపోయిన బుడ్డోడిని రెస్క్యూటీమ్ క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఈ అద్భుతం జరిగింది. రెస్క్యూటీమ్ బాలుడిని బయటకు తీసుకొచ్చి, ఆస్పత్రికి తరలిస్తుంటే అక్కడున్నవారంతా ఈలలు, చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 13 మంది చనిపోయారు. ఇంకా కొందరి ఆచూకీ దొరకలేదు,

మరికొంత మంది ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డెత్ టోల్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. సోమవారం రాత్రి నుంచి కొనసాగిస్తున్న రెస్క్యూ ఆపరేషన్లో 60 మందికి పైగా బాధితులను కాపాడినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలేంటన్నది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ..నిర్మాణ పనుల్లోనాణ్యత లేకపోవడం, రిపేర్లు చేయించకపోవడం వల్లే బిల్డింగ్ కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం రాత్రిపూట జరగడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఏడేళ్ల కిందట కట్టిందే….
రాయిగఢ్ జిల్లామహాద్ లోని కాజల్ పురాలో తారీఖ్ గార్డెన్ బిల్డింగ్ రాత్రి 7 గంటల సమయంలో కూలిపోయింది. ఈ బిల్డింగ్ ను ఏడేళ్ల కిందట కట్టారు. అందులో 45 ఫ్లాట్లు ఉన్నాయి. ప్రమాదానికి కొన్ని సెకెన్ల ముందే కొందరు తప్పించుకున్నారు. కానీ చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు మూడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, 12 ఫైర్ బ్రిగేడ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
60 మందికి పైగా కాపాడాయి. తీవ్రంగా గాయపడ్డవారిని ముంబైకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బిల్డింగ్ కూలిన సమయంలో ఓ వ్యక్తికి రాయి తగిలిందని, దీంతో అతడు కార్డియాక్ అరెస్ట్ కు గురై చనిపోయాడని పోలీసులు చెప్పారు. అతడు ఆ బిల్డింగ్ లో ఉండే వ్యక్తి కాదన్నారు.

నాణ్యత లేని పనులు.. రిపేర్లు చేయించని బిల్డర్

నాణ్యత లేకుండా కట్టడంవల్లే భవనం కూలిపోయిందని, రిపేర్లు చేయించేందుకు బిల్డర్ నిరాకరించాడని అందులో ఉంటున్నవారు చెప్పారు. ‘బిల్డింగ్ నిర్మించి మీకు అప్పజెప్పా. ఇక ఏం చేసుకుంటారో మీ ఇష్టం’ అని చెప్పాడన్నారు. బిల్డింగ్ లో ఉంటున్న వాళ్లువెళ్లి ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదని వాపోయారు.
ఐదుగురిపై కేసు
బిల్డర్, ఆర్కిటెక్ స‌హా ఐదుగురిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ‘‘ఈ దారుణానికి కాంట్రాక్ట‌ర్ బాధ్యుడు. అతడిపై కేసు పెట్టాం . అధికారుల హస్తం ఉందని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మినిస్టర్ ఏక్నాథ్ షిండే హెచ్చరించారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యాక దర్యాప్తు ప్రారంభించనున్నారు.

నలుగురు కనిపించట్లే..
మ వాళ్లునలుగురు కనిపించట్లేదని రియాజ్ ముల్లా కన్నీళ్లు పెట్టుకున్నాడు. బ్రదర్ భార్య, ముగ్గురు పిల్లల ఆచూకీ తెలియలేదన్నాడు. విషయం తెలిసి దుబాయ్ లో ఉంటున్న తన సోదరుడు బయల్దేరాడని చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం