మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు పదవి గండం!

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు పదవి గండం!
  • ఎమ్మెల్సీగా నియమించాలని రెండోసారి తీర్మానించిన కేబినెట్
  • మే 28 లోపు ఎన్నిక కాకుంటే సీఎం పదవి పోయే చాన్స్

ముంబై: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీటులో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను నియమించాలని కోరుతూ రాష్ట్ర కేబినెట్ మరోసారి తీర్మానించింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి పంపించినట్లు అజిత్ పవార్ మీడియాకు వెల్లడించారు. థాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఏప్రిల్ 9న గవర్నర్ కు సిఫార్సు చేసింది. దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో మంగళవారం మరోసారి సమావేశమైన కేబినెట్ థాక్రేను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటూ గవర్నర్ కు సిఫార్సు చేసింది. అయితే.. ఈ సారైనా గవర్నర్ ఆమోదిస్తారా.. లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

2019 నవంబర్ 28 న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన థాక్రే ఏ సభలోనూ సభ్యుడు కాదు. రాజ్యాంగం ప్రకారం, ఆయన సీఎం పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లోపు శాసన సభకు లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన థాక్రే మే 28 లోగా ఏదో ఒక సభలో సభ్యత్వం పొందకపోతే రాజీనామా చేయాల్సి వస్తుంది. అదే జరిగితే రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తప్పదు.