బీజేపీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్ భేటీ

బీజేపీ పెద్దలతో షిండే, ఫడ్నవీస్ భేటీ

ఢిల్లీ పర్యటిస్తున్న మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్  షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ఇటీవలే మహారాష్ట్రలో బీజేపీతో కలిసి అధికారాన్ని చేపట్టిన ఏక్ నాథ్ షిండే..త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్లతో పదవుల పంపకాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

 


రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను  షిండే, ఫడ్నవీస్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా మర్యాదపూర్వకంగా కలవనున్నారు. 

మరికాసేపట్లో ప్రధాని మోడీతో ఏక్ నాథ్  షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ అవనున్నారు. మహా రాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన పలు విషయాలను మోడీకి వివరించనున్నారు. అలాగే  మంత్రి మండలి ఏర్పాటుపై చర్చించనున్నారు.  

శుక్రవారం రాత్రి హోంమంత్రి అమిత్ షాను షిండే, ఫడ్నవీస్ కలిశారు. బీజేపీ, షిండే నేతృత్వంలోని వర్గానికి పదవుల పంపకాలపై  చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో షిండే, ఫడ్నవీస్ ప్రజలకు నమ్మకంగా సేవ చేస్తారని, మహారాష్ట్రను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని నమ్మకం ఉందని ట్విట్టర్‌లో అమిత్ షా  పేర్కొన్నారు. 

మరోవైపు ఏక్ నాథ్ షిండేతోపాటు15 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై ఈనెల 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో షిండే,ఫడ్నవీస్ లు దేశ రాజధానిలో కమలనాథులను కలవడం చర్చనీయాంశంగా మారింది. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న షిండే... శివసేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మద్దతు తనకే ఉందన్నారు.