రేప్ కేసు వెనక్కి తీసుకోలేదని.. భార్యాభర్తల దుస్తులు చింపేసి బెల్టుతో..

రేప్ కేసు వెనక్కి తీసుకోలేదని.. భార్యాభర్తల దుస్తులు చింపేసి బెల్టుతో..

రేప్ కేసు వెనక్కి తీసుకోలేదని భార్యాభర్తలపై విచక్షణా రహితంగా దాడి చేశారు ఎనిమిది మంది దుండగులు. ఆటోలో వెళ్తుండగా అడ్డుకొని.. వారి దుస్తులు చించేసి.. పైన పెట్రోల్ పోసి బెల్టుతో కొట్టారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గత నెల 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి, గాలిస్తున్నట్లు మంగళవారం నాడు పోలీసులు తెలిపారు.

మహిళ సోదరుడు, బావ.. 

గత నెల 24వ తేదీ రాత్రి 8.20 గంటల సమయంలో ఆ మహిళ (29), ఆమె భర్త ఆటోలో వెళ్తుండగా.. ఔరంగాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర 8 మంది బ్యాచ్ అడ్డుకుంది. వారిని ఆటోలో నుంచి బయటకు లాగి.. పక్కనే ఉన్న ఓ రూమ్‌లోకి లాక్కెళ్లారు. అక్కడ వాళ్లు ఆ ఇద్దరి దుస్తులు చించేసి.. పైన పెట్రోల్ పోసి చంపుతామని బెదిరించారు. బెల్టుతో తీవ్రంగా హింసించారు. 2016లో ఆ మహిళపై ఈ ఎనిమిది మందిలో కొందరు రేప్ చేశారు. వారిపై నాడు ఆమె పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోవాలంటూ ఈ రకంగా దాడి చేశారు. ఈ గ్యాంగ్‌లో ఆ మహిళ సోదరుడు, ఇద్దరు బావలు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. వీరిలో కొందరు తాము పోలీసులమని చెప్పి ఆటోను అడ్డుకున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో మంగళవారం వారు బాధితుల ఇంటికి వెళ్లి వివరాలు తీసుకుని.. ఆ దుర్మార్గులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ ఎనిమిది మంది పరారీలో ఉన్నారని, వారిని గాలిస్తున్నామని ఎస్పీ సాగర్ పాటిల్ చెప్పారు.