వాటే షాక్: మూడో అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్ నరహరి

వాటే షాక్: మూడో అంతస్తు నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్ నరహరి

ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మూడో అంతస్తుపై నుంచి దూకేశారు. ఆయన దూకిన సమయంలో వల కట్టి ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయం అయిన మంత్రాలయ బిల్డింగ్ పై నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఆయన దూకేయడంతో హైడ్రామా చోటుచేసుకుంది.

 

ఎస్టీ కేటగిరీలో ఉన్న ధన్గర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనల్లో భాగంగా మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, మరికొందరు గిరిజన ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. నేరుగా మంత్రాలయ బిల్డింగ్కు చేరుకుని థర్డ్ ఫ్లోర్ నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు. నెట్ కట్టి ఉండటంతో ఎవరికీ ఏం కాలేదు.

 

పెసా చట్టం (Pesa Act) ప్రకారం ఉద్యోగ నియామకాలను వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా మహారాష్ట్రలో గిరిజన విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోకపోవడంతో గిరిజన ఎమ్మెల్యేలు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చర్చలు జరిపారు. ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగానే ఉన్నామని సీఎం చెప్పినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళన బాట పట్టారు.