
ఆగ్రాలో హృదయం చలించిపోయే ఘటన చోటుచేసుకుంది. మానవ సంబంధాలు ఇంత దిగజారి పోతున్నాయన్న వాదనలకు ఈ ఘటన నిజం చేస్తుంది. ఇంట్లో ఓ మనిషి బాధలో ఉంటే కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేసే విష సంస్కృతికి ఇది ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. విహార యాత్రకు వెళ్లిన ఓ కుటుంబం తమ కారులో దీనస్థితిలో వృద్ధుడిని కట్టేసి వెళ్లారు. ఆ తర్వాత ఏంజరిగిందంటే..
మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం తాజ్ మహల్ సందర్శన కోసం వెళ్తూ తమ కారులో 80 ఏళ్ల వృద్ధుడిని కట్టేసి వెళ్లారు. కారు కిటికీలు మూసి ఉండటంతో వృద్ధుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గమనించిన పార్కింగ్ సిబ్బంది అప్రమత్తమై, కారు కిటికీని పగలగొట్టి ఆ వృద్ధుడిని రక్షించారు.
ఈ ఘటన శుక్రవారం (జూలై18) ఆగ్రా తాజ్ మహల్ సమీపంలోని శిల్ప్ గ్రామ్ పార్కింగ్ ప్రాంతంలో జరిగింది. మహారాష్ట్ర నుంచి ఆగ్రాకు వచ్చిన ఓ కుటుంబం తాజ్ మహల్ చూడటానికి వెళ్లింది. వారు తమ కారును శిల్ప్‌గ్రామ్ పార్కింగ్‌లో ఉంచారు. అయితే ఆ కుటుంబంలోని 80 ఏళ్ల వృద్ధుడిని కారులోనే వదిలేసి, సీటు బెల్టుతో కట్టేసి వెళ్లారు.
పార్కింగ్ సిబ్బంది కారు దగ్గరకు వచ్చి చూసినప్పుడు వృద్ధుడు కారులో బందీగా ఉన్నాడు. కారు కిటికీలు పూర్తిగా మూసి ఉండటంతో, అతడు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు గమనించారు. వృద్ధుడు చాలా బలహీనంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఇది అత్యవసర పరిస్థితి అని గ్రహించిన పార్కింగ్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారు కిటికీని పగలగొట్టారు. కారులోంచి బయటికి తీసి కాపాడారు. అప్పటికే అతడు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న వృద్దుడిని పార్కింగ్ సిబ్బంది వెంటనే అతడికి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం వృద్ధుడు కోలుకున్నాడు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని విచారించారు. అతని కుటుంబ సభ్యులు తాజ్ మహల్ సందర్శన ముగించుకుని తిరిగి రాగానే పోలీసులు వారిని నిలదీశారు. వృద్ధుడిని కారులో కట్టేసి వెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన సమాజంలో వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై తీవ్రమైన చర్చను రేకెత్తిస్తోంది. వృద్ధులు ,పిల్లలను ఒంటరిగా వదిలివేయడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల కారు లోపల ఉష్ణోగ్రత త్వరగా పెరిగి, ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది.
ఈ ఘటనలో సకాలంలో పార్కింగ్ సిబ్బంది స్పందించడం వల్ల ఓ ప్రాణం నిలిచింది. వారి సమయస్ఫూర్తిని, మానవత్వాన్ని అందరూ అభినందిస్తున్నారు.