ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ లేఖ

ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ లేఖ

ముంబయి : మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి ఆసక్తికరంగా మారుతున్నాయి. గురువారం బల నిరూపణ నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనార్టీలో పడిందని బీజేపీ సహా పలువురి నుంచి లేఖలు అందిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. శివసేనకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి వైదొలుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్యబద్ధంగా లేవని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఉద్ధవ్ ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, సర్కారు మైనార్టీలో  ఉందని తాను నమ్ముతున్నానని కోశ్యారీ లేఖలో ప్రస్తావించారు.

బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్‌ ఎంట్రీతో మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశించారు. ఈ క్రమంలో షిండే వర్గంలోని రెబల్ ఎమ్మెల్యేలు గురువారం గువాహటి నుంచి ముంబయి చేరుకోనున్నారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను బలపరీక్షకు ఆదేశించాలని దేవేంద్ర ఫడణవీస్‌ గవర్నర్​ను కోరిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం జరగడం విశేషం.