మహారాష్ట్ర, హర్యానా పోల్ షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్(ఈసీ) రెడీ అయింది. దీపావళిలోపే ప్రక్రియ ముగించాలని ఈసీ భావిస్తోందని, ఆ మేరకు రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అసెంబ్లీల గడువు ముగుస్తుండటంతో ఈ ఏడాది చివర్లోగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లో ఎన్నికలు చేపట్టాల్సిఉండగా, లెఫ్ట్ తీవ్రవాదం కారణంగా ఫేజ్‌ల సంఖ్య పెంచాల్సిరావడం, ఆమేరకు సరిపడా పారామిలిటరీ బలగాలు మోహరించాల్సిఉండటం లాంటి ఇబ్బందుల వల్ల జార్ఖండ్ అసెంబ్లీకి విడిగా నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.
2014లో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు సెప్టెంబర్ 20న షెడ్యూల్ ప్రకటించి, అక్టోబర్ 15న పోలింగ్, 19న కౌంటింగ్ చేపట్టారు. అదే ఏడాదిలో జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య ఐదు ఫేజ్‌ల్లో పోలింగ్ జరిగింది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ మూడు రాష్ట్రాల్లో 2019 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరి రౌండ్ రివ్యూలు కూడా పూర్తికావచ్చాయి. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలోని ఈసీ టీమ్ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ)తో చర్చలు జరిపింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పారామిలిటరీ ఫోర్స్ మోహరింపుపై ఈసీకి చెందిన మరో టీం కేంద్ర హోం మంత్రిత్వ శాఖతోనూ మంతనాలు జరిపింది. మహారాష్ట్రకు సంబంధించి ఈసీ రివ్యూలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈసీ గైడ్‌లైన్‌ను అనుసరిస్తూ పోలింగ్ డ్యూటీలో పాల్గొనే సిబ్బంది జాబితాను కూడా రెండు రాష్ట్రాల అధికారులు సిద్ధం చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ
మొత్తం సీట్లు: 288
ఓటర్లు: 8కోట్ల 73లక్షల 30వేల 484
ప్రధాన పార్టీలు: బీజేపీ–శివసేన కూటమి, కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి
ప్రస్తుత బలాబలాలు: బీజేపీ–124, శివసేన–61, కాంగ్రెస్–36, ఎన్సీపీ–32
హర్యానా అసెంబ్లీ
మొత్తం సీట్లు: 90
ఓటర్లు: 1కోటి 60 లక్షల 97వేల 230
ప్రధాన పార్టీలు: బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ
ప్రస్తుత బలాబలాలు: బీజేపీ–47,
కాంగ్రెస్–16, ఐఎన్ఎల్డీ–7
జార్ఖండ్ అసెంబ్లీ
మొత్తం సీట్లు: 81
ఓటర్లు: 2కోట్ల 3లక్షల49వేల 795
ప్రధాన పార్టీలు: బీజేపీ–ఏజేఎస్‌యూ కూటమి, జేఎంఎం–కాంగ్రెస్ కూటమి
ప్రస్తుత బలాబలాలు: బీజేపీ–43, జేఎంఎం–19, కాంగ్రెస్–8, ఏజేఎస్‌యు–3
