
- మంత్రి మాణిక్ రావుపై మండిపడ్డ ప్రతిపక్ష ఎమ్మెల్యే
- ఫోన్ చెక్ చేశానే తప్ప రమ్మీ ఆడలేదన్న మాణిక్ రావు
ముంబై: మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్ రావు కోకాటే అసెంబ్లీలో సెల్ ఫోన్ లో రమ్మీ ఆడారని ప్రతిపక్ష ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. సభలో మాణిక్ రావు తన సెల్ఫోన్ లో రమ్మీ ఆడుతున్న వీడియో అంటూ ‘ఎక్స్’ లో ఓ వీడియో పోస్టు చేశారు. రైతుల సమస్యలపై మహాయుతి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. ‘‘అధికార ఎన్సీపీ వర్గం బీజేపీని సంప్రదించకుండా పని చేయలేకపోతున్నది.
వ్యవసాయ రంగంలో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వాటన్నింటినీ మంత్రి గాలికొదిలేశారు. అయినా కూటమి ప్రభుత్వంలో బీజేపీని సంప్రదించకుండా ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) నేతలు ఏమీ చేయలేకపోతున్నారు. చేసేదేంలేకపోవడంతో మంత్రి తన మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు” అని రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు. అయితే, ఆ వీడియోపై మంత్రి మాణిక్ రావు క్లారిటీ ఇచ్చారు. తాను రమ్మీ ఆడలేదని చెప్పారు. ‘‘ఎగువ సభ వాయిదా పడ్డాక నేను నా ఫోన్ తీసుకున్నా.
దిగువ సభ ఎలా జరిగిందో చూద్దామని యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఆ సమయంలో గేమ్ డౌన్లోడ్ అయి ఓపెన్ అయింది. దానిని క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. అదంతా ఐదు నుంచి పది సెకండ్లలో జరిగిపోయింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వీడియో అదే. ఐదారు సెకండ్ల ఫుటేజీ మాత్రమే వైరల్ చేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎందుకు చూపట్లేదు?” అని మంత్రి ప్రశ్నించారు. మంత్రి తీరుపై కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత (సీఎల్పీ) విజయ్ వాడెట్టివర్ కూడా తీవ్రంగా మండిపడ్డారు