ఎట్టకేలకు మహారాష్ట్ర రాజకీయం ఓ కొలిక్కి వచ్చింది. కూటమి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతుంది. రెండు రోజుల కిందట.. ప్రభుత్వాన్ని మేం ఏర్పాటు చేస్తామంటే.. మేం ఏర్పాటు చేస్తామంటు కూటమి, బీజేపీ తెగ పోటీ పడ్డాయి. అనూహ్యంగా ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా.. బల నిరూపణకు తమకు సంఖ్యా బలం లేదని ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దాంతో శివసేనకు లైన్ క్లీయర్ అయింది. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి. అందులో భాగంగా ఈ రోజు ప్రొటెం స్పీకర్ కాళిదాసు.. ఎమ్మెల్యే అభ్యర్థులందరితో ప్రమాణం చేయిస్తున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అసెంబ్లీ ఆవరణలో ఉండి ఎమ్మెల్యేలందరికి ఆహ్వానం పలుకుతూ కనిపించింది. అటుగా వస్తున్న ఫడ్నవిస్‌ను సైతం ఆహ్వానించింది. ఆ తర్వాత అన్న అజిత్ పవార్‌ని ఆలింగనం చేసుకొని మరి అసెంబ్లీలోకి ఆహ్వానం పలికింది. ఇప్పటికే కూటమి.. తమ సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ థాక్రేను ప్రకటించింది. ఉద్ధవ్ థాక్రే గురువారం సాయంత్రం 6:40 నిమిషాలకి దాదార్‌లోని శివాజీపార్క్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
