మహా సంక్షోభం: జాతీయ కార్యవర్గంతో ఉద్ధవ్ కీలక భేటీ..

మహా సంక్షోభం: జాతీయ కార్యవర్గంతో ఉద్ధవ్ కీలక భేటీ..

రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా నేపథ్యంలో ఇవాళ కీలక భేటీ నిర్వహించబోతున్నారు ఉద్ధవ్ థాక్రే. జాతీయ కార్యవర్గంతో ఉద్ధవ్ సమావేశం కాబోతున్నారు. కరోనా కారణంగా వర్చువల్ గా ఈ భేటీలో పాల్గొననున్నారు ఉద్ధవ్ థాక్రే. రాజీనామా చేయాలా..? లేకపోతే రెబల్స్ తో పోరాడాలా అనే అంశాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. భేటీ తర్వాత సాయంత్రం ఉద్ధవ్ థాక్రే మళ్లీ మీడియాతో మాట్లాడతారని శివసేన నేతలంటున్నారు. 


12మంది ఎమ్మెల్యేలతో పాటు.. మరో నలుగురిపై అనర్హతకు సిఫారసు చేసింది శివసేన. ఇవాళ వారికి నోటీసులు అందే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వీటిపై డిప్యూటీ స్పీకర్ ఆఫీసులో ఆల్రెడీ కసరత్తు నడుస్తోందని శివసేన నేతలంటున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు అందుతాయని ఉద్ధవ్ వర్గం అంటోంది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ కోరే చాన్స్ ఉందంటున్నారు. 

అస్సాం రాజధాని గౌహతిలో మకాం పెట్టిన రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పుడప్పుడే అక్కడి నుంచి కదిలే పరిస్థితులు కనిపించడం లేదు. అనర్హత వేటు పడటమో, అధికారం తమకు చేజిక్కడమో జరిగే వరకు హోటల్ వీడి బయటకు వచ్చే ప్రసక్తే లేదంటున్నారు రెబల్ ఎమ్మెల్యేలు. తమపై అనర్హత వేటు పడే ఛాన్సే లేదంటున్నారు. తక్కువ సమయంలో ఎల్పీ మీటింగ్ పెట్టి.. రాలేదనడం లీగల్ గా చెల్లుబాటు కాదంటున్నారు.  తమపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ ను కోరడం రాజ్యాంగవిరుద్ధమని చెబుతున్నారు. ఉద్ధవ్ వర్గం నిర్ణయాలపై అవసరమైతే కోర్టుకు వెళ్తామంటున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం గౌహతిలోని రాడిసన్ హోటల్ లో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు షిండే.