పట్టువీడని శివసేన.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం

పట్టువీడని శివసేన.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్​లతో చర్చలు
  • కాంగ్రెస్ చీఫ్ థోరట్, మాజీ సీఎం అశోక్ చవాన్​తో ఉద్ధవ్ భేటీ
  • సీఎంపీపై గంటపాటు చర్చలు
  • ప్రభుత్వ ఏర్పాటుపై సరైన సమయంలో నిర్ణయం: ఉద్ధవ్
  • అవసరమైతే శివసేనతో మరోసారి చర్చలు: థోరట్
  • జైపూర్ రిసార్టు నుంచి ముంబై తిరిగొచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ముంబై:

రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినా.. మహారాష్ర్ట రాజకీయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మిత్రపక్షం బీజేపీతో విభేదించిన శివసేన.. పట్టిన పట్టువీడటం లేదు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన పంతం నెగ్గించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటువైపున ఎన్సీపీ సిద్ధంగానే ఉన్నా.. గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ తటపటాయిస్తోంది. దీంతో గత సోమవారం నుంచి మహా రాజకీయం మలుపులు తిరుగుతూనే ఉంది. చర్చల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా కాంగ్రెస్ నేతలతో శివసేన చీఫ్ ఉద్ధవ్ సమావేశమయ్యారు.

సానుకూల పరిణామం: మహా కాంగ్రెస్ చీఫ్ థోరట్

‘‘మర్యాదపూర్వకంగానే మీటింగ్ జరిగింది. ఇదో సానుకూల పరిణామం” అని మహా కాంగ్రెస్ చీఫ్ థోరట్ చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రామ్‌(సీఎంపీ)పై చర్చించేందుకు ఏఐసీసీ లీడర్లు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులతో మంగళవారం ఉద్ధవ్ భేటీ నేపథ్యంలో దాని కొనసాగింపుగానే తాము బుధవారం సమావేశమయ్యామని తెలిపారు. ‘‘కాంగ్రెస్, ఎన్సీపీ ముందుగా పరస్పర అవగాహనకు రావాల్సి ఉంది. కామన్ ఎజెండా కోసం పలు అంశాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత అవసరమైతే శివసేనతో మరోసారి చర్చిస్తాం”అని తెలిపారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్​ను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసే జాయింట్ కమిటీ కోసం ఎన్సీపీ ఐదుగురు పేర్లను ఇచ్చిందని, కాంగ్రెస్ కూడా త్వరలోనే తమ సభ్యుల పేర్లు వెల్లడిస్తుందని చెప్పారు. చర్చలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకే తాము సమావేశమయ్యామని మాణిక్​రావ్ థాకరే చెప్పారు.

‘సీఎం’పై ఎన్సీపీ పట్టు

సీఎం పదవి విషయంలో ఎన్సీపీ పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. 50:50 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చిన ఎన్సీపీ.. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచాలని డిమాండ్‌‌‌‌ చేస్తోందని తెలిసింది. మొదటి రెండున్నరేళ్లు శివసేన సీఎం పదవిని చేపడితే.. ఆ తర్వాతి రెండున్నరేళ్లు తమకు ఆ పీఠాన్ని అప్పగించాలని ఎన్సీపీ నేతలు డిమాండ్‌‌‌‌ చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌‌‌‌ పార్టీ మాత్రం కీలకమైన స్పీకర్‌‌‌‌ పదవి కోరుతున్నట్టు సమాచారం.

సీఎం సీటు మాదే

ఛాతినొప్పి కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన శివసేన ఎంపీ సంజయ్‌‌‌‌ రౌత్‌‌‌‌ బుధవారం డిశ్చార్జ్‌‌‌‌ అయ్యారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం పదవి శివసేనదేనని, తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన నేత పగ్గాలు చేపడుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సుప్రీంలో పిటిషన్​పై సేన వెనక్కి

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్​ మూడు రోజుల టైమ్​ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ శివసేన మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 10.30 గంటలకు కోర్టు ముందుకు ఈ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. అయితే శివసేన తరఫు న్యాయవాది సునీల్‌‌‌‌ ఫెర్నాండెజ్‌‌‌‌ మాత్రం తమ పిటిషన్​ను ప్రస్తావనకు తీసుకురాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల వెనక్కి తగ్గిన శివసేన.. ఈ పిటిషన్‌‌‌‌పై బుధవారం ఏ విధమైన విచారణ కోరట్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాము ఎలాంటి కొత్త పిటిషన్లు దాఖలు చేయట్లేదని ఫెర్నాండెజ్‌‌‌‌ చెప్పారు. రాష్ర్టపతి పాలనను సవాలు చేస్తూ వేయాల్సిన పిటిషన్ ఇంకా రెడీ అవుతోందని చెప్పారు.

ఆస్తులు, ఫైళ్లు ఇవ్వండి.. మినిస్ట్రీలకు జీఏడీ ఆర్డర్స్

మహారాష్ర్టలో రాష్ట్రపతి పాలన షురూ అయింది. అస్తులు, ఫైళ్లను బుధవారం సాయంత్రంలోగా తమకు అందజేయాలని మంత్రిత్వ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఆదేశాలు జారీ చేసింది. తమ ఉత్తర్వులు అన్ని మంత్రిత్వ శాఖలు, మంత్రుల కోసం పని చేస్తున్న ఓఎస్డీలు. పర్సనల్ సెక్రెటరీలు, పర్సనల్ అసిస్టెంట్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. టెలిఫోన్​బిల్లులు సబ్మిట్ చేయాలని, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అందులో పేర్కొంది. ఫైళ్లు, రహస్య డాక్యుమెంట్లు, ఆఫీస్ స్టేషనరీ, ఫర్నిచర్​తదితరాలను రిటర్న్ చేయాలని సూచించింది.

చర్చలు సరైన దిశలోనే: ఉద్ధవ్ థాకరే

మహారాష్ర్టలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు కొనసాగుతున్నాయని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. చర్చలు సరైన దిశలోనే సాగుతున్నాయని వెల్లడించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, మాజీ ముఖ్యమత్రి అశోక్ చవాన్, సీనియర్ నేత మాణిక్​రావ్ థాకరే తదితరులతో ముంబైలోని ఓ హోటల్​లో ఉద్ధవ్​భేటీ అయ్యారు. సుమారు గంటపాటు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్​(సీఎంపీ)పై చర్చించారు. ‘‘అంతా సాఫీగానే జరుగుతోంది. చర్చలు సరైన దారిలోనే సాగుతున్నాయి. సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం” అని భేటీ తర్వాత మీడియాకు ఉద్ధవ్ చెప్పారు. ఈ సమావేశానికి ముందు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్​ను థోరట్, చవాన్, మాణిక్​రావ్ థాకరే కలిశారు.

‘ఆపరేషన్ ​లోటస్’​ను అడ్డుకుంటం

కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన కలవకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.‘ఆపరేషన్ లోటస్’ విషయంలో మా పార్టీ అలర్ట్​గా ఉంది. దాన్ని ఇక్కడ జరగకుండా అడ్డుకుంటాం.- మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్

ముంబైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

రాష్ర్టపతి పాలన అమల్లోకి రావడంతో రాజస్థాన్​నుంచి తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వెనక్కి రప్పించింది. మంగళవారం దాకా జైపూర్​లోని రిసార్టులో ఉన్న నేతలు.. బుధవారం ముంబై చేరుకున్నారు. ‘మా 44 మంది రక్తంలోనే కాంగ్రెస్ ఉంది. మమ్మల్ని ఎవరూ కొనలేరు’ అని రిసార్టు నుంచి వచ్చిన ఎమ్మెల్యే అన్నారు.

Maharashtra political crisis: No deal with Congress-NCP yet, talks in process: Shiv Sena