
ముంబై: ఆఖరి రోజుల్లో భార్య సహచర్యంలో కాలాన్ని గడపాల్సిన ఓ వృద్ధుడు(84) చివరకు ఆమెనే అంతమొందించాడు. జీవితపు చరమాంకంలో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, శవాన్ని కూడా తగులబెట్టి, సాక్ష్యం లేకుండా చేద్దామనుకున్నాడు. చివరకు కుటుంబ సభ్యులు గమనించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. మహారాష్ట్రలోని డొంబివాలిలోని పాండురంగ్ వాడి ప్రాంతంలో ఆదివారం జరిగిందీ దారుణం.
మన్పాడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డొంబివాలి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ రామకాంత్ పాటిల్ కుటుంబం పాండురంగ్ వాడి ప్రాంతంలో నివాసముంటోంది. ఆదివారం ఉదయం.. అతని తండ్రి బలరామ్ పాటిల్(84).. తన భార్య పార్వతి(80)ని బెడ్ రూమ్‌లో కత్తితో పలుమార్లు పొడిచి, దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత శవాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే బెడ్‌రూమ్ నుంచి దట్టమైన పొగ రావడం గమనించిన రమాకాంత్ భార్య వెంటనే అతన్ని నిద్రలేపింది. వెంటనే రమాకాంత్ పరుగెత్తుకొని వచ్చి ఆ గదివైపు వెళ్లి చూడగా.. గదిలో అతని తల్లి పార్వతి తీవ్రమైన కత్తిపోట్లకై గురై, శవంగా కనిపించింది. అతని తండ్రి మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడని తెలుసుకొని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన తండ్రి బలరామ్ చాలా కోపిష్టి అని, రోజూ భార్య పార్వతితో గొడవలకు దిగేవాడని రమాకాంత్, అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే అతని షార్ట్ టెంపర్ భార్యను చంపే స్థాయికి చేరుకుంటుందని తాము ఎప్పుడూ అనుకోలేదని వారు చెప్పారు. పోలీసులు ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించి.. సమీప ప్రాంతంలోనే బలరామ్ ను అరెస్ట్ చేశారు. విచారణలో బలరామ్ తన భార్యతో శనివారం రాత్రి గొడవ జరిగిందని, కోపంతో ఆమెను చంపివేశానని, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించానని పోలీసు అధికారులకు చెప్పాడు.