
న్యూఢిల్లీ: కొంతమంది మహారాష్ట్రలోని ఠాణేలో భారీ సైబర్ నేరానికి పాల్పడ్డారు. పేమెంట్ గేట్‌వే సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఖాతాను హ్యాక్ చేసి, వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.16,180 కోట్ల విలువైన నిధులను దోచేశారు. ఈ ఏడాది ఠాణేలోని ఒక కంపెనీ పేమెంట్ గేట్‌వే ఖాతాను హ్యాక్ చేసి రూ.25 కోట్లు తీసుకునట్లు మహారాష్ట్రలోని ఠాణే నగరంలోని శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలయింది.
ఈ మోసం చాలా కాలంగా జరుగుతోందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. దీనిపై పోలీసులు విచారణ జరపగా, రూ.16,180 కోట్లకు పైగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఠాణే క్రైమ్ బ్రాంచ్ అధికారి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 6న ఠాణేలోని నౌపడా పోలీసులు సంజయ్ సింగ్, అమోల్ అందాలే ఎలియాస్ అమన్, కేదార్ ఎలియాస్ సమీర్ డిఘే, జితేంద్ర పాండే సహా మరో గుర్తు తెలియని వ్యక్తిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 420 (మోసం), 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్), 467, 468 (ఫోర్జరీ), 120బీ (నేరపూరిత కుట్ర) ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.