ఆ పేషెంట్ చనిపోయింది కరోనా వల్ల కాదు

ఆ పేషెంట్ చనిపోయింది కరోనా వల్ల కాదు

మహారాష్ట్రలోని బుల్ధానాలో 71 ఏళ్ల పేషెంట్ మరణించింది కరోనా వల్ల కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో రెండు కరోనా మరణాలు ఒకటి కర్ణాటక, మరొకటి ఢిల్లీలో సంభవించాయని తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్.
మహారాష్ట్ర బుల్ధానా పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం 71 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన అతడు హై బీపీ, బ్లడ్ షుగర్‌తో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అయితే శనివారం ఉదయం జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో శాంపిల్స్ పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. అయితే ఆరోగ్య విషమించి శనివారం సాయంత్రం 4.30 సమయంలో అతడు మరణించాడు. దీంతో కరోనా అనుమానితుడు మృతి చెందాడని వార్తలు వచ్చాయి. అయితే పుణేలో టెస్టు చేసిన శాంపిల్స్‌లో అతడికి కరోనా లేదని తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజీవ కుమార్ వెల్లడించారు.

80.56 లక్షల ఎన్-95 మాస్కులకు ఆర్డర్

దేశ వ్యాప్తంగా నిన్న పుణే ల్యాబ్‌కు వచ్చిన శాంపిల్స్‌లో 23 పాజిటివ్ వచ్చాయని, దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 107కు చేరిందని సంజీవ కుమారత్ తెలిపారు. కొత్తగా పెరిగిన కేసుల్లో మహారాష్ట్రలో 17, తెలంగాణలో రెండు, రాజస్థాన్‌లో 1, కేరళలో 3 ఉన్నాయని చెప్పారు. కరోనా టెస్టులు చేసేందుకు అవసరమైన ఎక్యూప్మెంట్ భారీగా అందుబాటులో ఉందని, ఇప్పటి వరకు ఉన్న ఫుల్ కెపాసిటీలో 10 శాతం మాత్రమే వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్‌తో పాటు 80,56,365 ఎన్-95 మాస్కుల కొనుగోలు చేసేందుకు ఆర్డర్ పెట్టినట్లు చెప్పారు.