కర్నాటకలోని 865 గ్రామాలు మహారాష్ట్రలో కలపాలి: ఏక్ నాథ్ షిండే

 కర్నాటకలోని 865 గ్రామాలు మహారాష్ట్రలో కలపాలి: ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్ర అసెంబ్లీలో సర్కారు తీర్మానం

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీలో సరిహద్దు గ్రామాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. మరాఠా జనాభా తగ్గించొద్దని తీర్మానంలో ప్రభుత్వం ప్రస్తావించింది. కర్ణాటక - మహారాష్ట్ర సరిహద్దులోని మొత్తం 865 గ్రామాలను మహారాష్ట్రలో కలపాలన్న తీర్మానాన్ని  ఏక్ నాథ్ షిండే సర్కారు ఆమోదం తెలిపింది.  బెలగావి, బీదర్, నిపాని, కార్వార్ వంటి ప్రాంతాలు మహారాష్ట్రకు ఇవ్వాల్సిందే అని అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు.  

శాసన మండలి ప్రతిపక్ష బెంచ్‌లపై తొలిసారిగా హాజరైన మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర -కర్ణాటక సరిహద్దులోని వివాదాస్పద ప్రాంతాలకు సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కేంద్ర పాలిత హోదా ఇవ్వాలని డిమాండ్ ను ప్రస్తావించారు. అసెంబ్లీ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఇదే విషయాన్ని మీడియావద్ద ప్రస్తావించిన ఉద్ధవ్ ఠాక్రే  మహారాష్ట్రకు అనుకూలంగా ఏది జరిగినా మేం దానికి మద్దతిస్తాం కానీ  రెండు సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమను మహారాష్ట్రలో చేర్చాలని డిమాండ్ చేస్తుంటే మనం ఏమి చేస్తున్నామో ఆలోచించాలన్నారు. 

కేంద్ర హోంమంత్రితో జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరాలని డిమాండ్ చేశారు.  సరిహద్దు ప్రాంతాల్లోని మరాఠీ ప్రజల భద్రతకు హామీ ఇవ్వాలన్నారు. బెలగావి, బీదర్, కార్వార్, నిపానీ, భాల్కీ  పట్టణాలతోపాటు  కర్ణాటకలోని 865 మరాఠీ మాట్లాడే గ్రామాలను మహారాష్ట్రలో చేర్చేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.