- రూ.10 కోట్లతో టూరిజం హబ్
- ఫ్లోటింగ్ రెస్టారెంట్, కృత్రిమ బీచ్, జిప్‌లైన్ టవర్ ప్రధాన ఆకర్షణలు
- హుస్నాబాద్‌కు పర్యాటక కాంతి
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ ప్రాంతానికి గుండెకాయలాంటి మహాసముద్రం గండి ఇకపై నీటి వనరుగా మాత్రమే కాకుండా పర్యాటక ఆకర్షణగా నిలవబోతోంది. హుస్నాబాద్ మండలంలోని ఉమ్మాపూరు గ్రామ శివారులో ఉన్న మహాసముద్రం గండిని రూ.10 కోట్ల అంచనా వ్యయంతో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్స్వయంగా మహాసముద్రం గండిని సందర్శించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
కాలభైరవ ఆలయానికి ఏటీవీ ట్రాక్..
మహాసముద్రం గండి సమీపంలోని బయ్యన్న గుట్టలు చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఈ గుట్టలపై 12వ శతాబ్దం నాటి త్రిపుర భైరవీ సమేత మహా కాలభైరవుడు ఉన్నాడు. ఆలయాన్ని దర్శించుకోవడానికి కాలి నడక మార్గం ఉండడంతో రూ. 54 లక్షల అంచనా వ్యయంతో ఏటీవీ బైక్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ గుట్టలు ప్రాచీన శిలా శాసనాలు, గుహలు, శిల్పాలతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న పోరాటాల జ్ఞాపకాలను కూడా కలిగి ఉన్నాయి.
ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు..
మొత్తం అంచనా వ్యయం రూ.801.20 లక్షలు కాగా మిగిలిన నిధులను రహదారులు, వాచ్టవర్లు పార్కింగ్, విశ్రాంతి గృహాలు, భద్రతా సౌకర్యాల కోసం వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హుస్నాబాద్ పర్యాటక పటంలో చేరడమే కాకుండా స్థానిక యువతకు జల క్రీడలు, రెస్టారెంట్లు, ఇతర సేవల నిర్వహణలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ అభివృద్ధి పనులు హుస్నాబాద్‌తో పాటు సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల ప్రజలకు మంచి పర్యాటక గమ్యస్థానాన్ని అందించనున్నాయి.
త్వరలో పనులు ప్రారంభం
మహాసముద్రం గండి చారిత్రాత్మకమైన ప్రాంతం. దీనిని తెలంగాణలో అత్యంత ఆకర్షణీయమైన టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతాం. ప్రణాళికలు, పర్మిషన్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. త్వరలోనే అనుమతులు తెచ్చి, టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తాం. - మంత్రి పొన్నం ప్రభాకర్
