సారీ.. ఇలాంటి తప్పు ఇక జరగదు

సారీ.. ఇలాంటి తప్పు ఇక జరగదు
  • లిక్కర్ బాటిళ్లపై గాంధీ బొమ్మ వివాదం
  • సారీ చెప్పిన ఇజ్రాయెల్ కంపెనీ

జెరూసలెం: లిక్కర్ బాటిళ్లపై మహాత్మాగాంధీ బొమ్మ వివాదంపై ఇజ్రాయెల్ కంపెనీ సారీ చెప్పింది. ఇండిపెండెన్స్ వచ్చి 71 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ బాటిళ్లను సిద్ధం చేసింది.  ఇండియన్ గవర్నమెంట్, ప్రజల సెంటిమెంట్లను నొప్పించినందుకు క్షమాపణ చెప్పింది. లిక్కర్ బాటిళ్లపై గాంధీ బొమ్మ విషయాన్ని  రాజ్యసభ సభ్యులు చైర్మన్ వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకునేలా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు సూచించాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ల సెంటిమెంట్లను నొప్పించినందుకు మల్కా బీర్ సారీ చెబుతోందని ఆ  కంపెనీ బ్రాండ్ మేనేజర్ గిలద్ డ్రార్ ప్రకటించారు. మహాత్మాగాంధీని, ఆయన విలువలను  గౌరవిస్తామని, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని కోరారు.

ఇజ్రాయెల్ లోని ఇండియన్ ఎంబసీ ఈ అంశాన్ని లేవనెత్తగానే లిక్కర్ బాటిళ్ల ప్రొడక్షన్, సప్లయ్ నిలిపివేశామన్నారు. మార్కెట్ లో ఉన్న బాటిళ్లను కూడా వెనక్కి రప్పిస్తున్నట్లు చెప్పారు. లిక్కర్ బాటిళ్లపై ఇజ్రాయెల్ మాజీ ప్రధాన మంత్రులు డేవిడ్ గురియన్, గోల్డా మేర్, మెనకాన్ బెగిన్, జియోనిజం పితామహుడు డియోడర్ హెర్జల్ బొమ్మలను వేశామని, గాంధీని గౌరవించేందుకే ఆయన బొమ్మను లిమిటెడ్ ఎడిషన్లపై వేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా చూస్తామన్నారు.