MahavatarNarsimha: ‘మహావతార్ నరసింహా’వసూళ్ల ప్రభంజనం.. ఫస్ట్ డే 2కోట్లు.. 9వ రోజు 15కోట్లు..

MahavatarNarsimha: ‘మహావతార్ నరసింహా’వసూళ్ల ప్రభంజనం.. ఫస్ట్ డే 2కోట్లు.. 9వ రోజు 15కోట్లు..

‘మహావతార్ నరసింహా’ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. జూలై 25న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీకి థియేటర్లు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. సుమారు రూ.15 కోట్లు బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ 9 రోజుల్లో రూ.79 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు (ఆగస్ట్ 3న) అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి వసూళ్ల వివరాలు వెల్లడించారు. 

'బాక్సాఫీస్ వద్ద ఒక దివ్యమైన సంఘటన. ప్రపంచవ్యాప్తంగా రూ.79కోట్ల గ్రాస్ సాధించి దూసుకెళ్తోంది. ఇండియాలో ప్రస్తుతం లెక్కింపులో ఉంది. మహావతార్ నరసింహ దేశవ్యాప్తంగా పురాణ విజృంభణను కొనసాగిస్తోంది. ఇప్పుడే సినిమా థియేటర్లలో గర్జనను అనుభవించండి' అని హోంబాలే ఫిల్మ్స్ మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలో మహావతార్ నరసింహా ఇండియాలోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన యానిమేటెడ్ ఫిల్మ్ గా చరిత్ర సృష్టించింది.

అంతేకాకుండా ఈ మూవీ ఇండియా వైడ్గా 9 రోజుల్లో రూ రూ.72.54కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నిన్న శనివారం ఒక్కరోజే రూ.15.4కోట్ల నెట్ రాబట్టింది. తెలుగులోనే రూ.3.2 కోట్లు వసూలు చేసి దూసుకెళ్తోంది. దేశంలో మరే యానిమేటెడ్ సినిమా సొంతం చేసుకుని రికార్డును మహావతార్ నరసింహా దక్కించుకుంది. మరోవైపు అమెరికాలోనూ ఈ మూవీ కరికార్డులు క్రియేట్ చేస్తుంది. అక్కడ వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిందని ఓవర్సీస్ ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది.

అశ్విన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యానిమేటెడ్ ఫిల్మ్  భారతీయ పురాణాలను ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులకు చేరువచేయాలన్న లక్ష్యంతో రూపొందించినది. భక్తుడైన ప్రహ్లాదుని అచంచలమైన విశ్వాసం, అతని భక్తికి మెచ్చి విష్ణువు నరసింహ అవతారంలో ప్రత్యక్షమై దుష్ట శిక్షణ చేసిన పౌరాణిక గాథను తిరిగి చెప్పింది. 

విష్ణు - హిరణ్యకశిపుల యుద్ధం, ప్రహ్లాదుడి కథ:

ఈ  'మహావతార్ నరసింహ' చిత్రంలో ప్రహ్లాదుడి చరిత్ర, భగవాన్ విష్ణువుకు, అసుర చక్రవర్తి హిరణ్యకశిపునికి మధ్య జరిగిన పౌరాణిక యుద్ధాన్ని అత్యంత ఆసక్తికరంగా చూపించారు. నరసింహ అవతార వెనుక ఉన్న అసలు కథను, దాని ప్రాముఖ్యతను ఈ యానిమేటెడ్ చిత్రం ద్వారా నేటి తరానికి పరిచయం చేశారు.

హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను తాను దేవుడిగా ప్రకటించుకుని, తన కుమారుడితో సహా తన ప్రజల నుండి భక్తిని కోరే కథను ఈ చిత్రం అనుసరిస్తుంది. అతని ఐదేళ్ల కొడుకు ప్రహ్లాదుడు, ధర్మానికి ప్రతీకగా నిలుస్తూ తండ్రికి ఎదురు తిరుగుతాడు.

ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ విష్ణుమూర్తి ఎప్పటికప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. చివరకు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఇకపోతే, విమర్శకుల ప్రశంసలు అందుకుని,  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ మూవీ  ఇంకాఎలాంటి రిర్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.