హరించుకుపోతున్న హరిణ వనస్థలి

హరించుకుపోతున్న హరిణ వనస్థలి
  • రెండేండ్ల కింద ఆటోనగర్ వైపు కూలిపోయిన ప్రహరీ గోడ
  • అటు నుంచి నేషనల్ ​పార్కులోకి మురుగు, రసాయన వ్యర్థాలు
  • ఒక్కొక్కటిగా ఎండిపోతున్న  పెద్ద పెద్ద చెట్లు
  • వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పు

ఎల్​బీనగర్, వెలుగు : రసాయన వ్యర్థాలు, మురుగుతో ఎల్​బీనగర్ నియోజకవర్గంలోని ‘మహావీర్​హరిణ వనస్థలి నేషనల్​పార్క్’ ఓ వైపు నుంచి పాడైపోతుంది. ఒక్కొక్కటిగా పెద్ద పెద్ద చెట్లు చచ్చిపోతున్నాయి. ఘాటైన వాసనలకు వన్యప్రాణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దాదాపు 3,800 ఎకరాల్లో విస్తరించి ఉన్న పార్కులో కృష్ణ జింకలతోపాటు దుప్పిలు, కుందేళ్లు, అడవి పందులు, ముళ్ల పందులు, నెమళ్లు, అనేక రకాల పక్షులు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటికి ప్రమాదం పొంచి ఉంది. ఆటోనగర్​వైపు ఉన్న పార్కు ప్రహరీగోడ రెండేండ్ల కింద కురిసిన అధిక వర్షాలకు కూలిపోయింది. దాదాపు100 మీటర్ల మేర తిరిగి నిర్మించాల్సి ఉండగా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఆటోనగర్ పైన ఉన్న కాలనీల నుంచి వచ్చే డ్రైనేజీ నీళ్లతోపాటు ఇండస్ట్రీల నుంచి వస్తున్న మురుగు, రసాయన వ్యర్థాలు పార్కులోకి చేరుతున్నాయి. దాదాపు10 ఎకరాల్లో మురుగు నీరు నిలిచి ఉంది. మురుగు ఉన్నంత మేర పెద్ద పెద్ద చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. కూలిన వెంటనే కొత్తగా గోడ నిర్మించి ఉంటే ఇంత ఎఫెక్ట్​ ఉండేది కాదు. ఇటుగా కుక్కలు పార్కులోకి వస్తున్నాయి. జీహెచ్ఎంసీ, ఐలా అధికారులు నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తుతుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. సరైన డ్రైనేజీ సిస్టమ్​లేకనే పై కాలనీల నుంచి మురుగు వస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ, ఐలా అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. బల్దియా అధికారులేమో డ్రైనేజీ సిస్టమ్ మంచిగానే ఉందని చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీల వద్ద డ్రైనేజ్ సిస్టం సరిగా లేదని, అది తమ పరిధిలోకి రాదని అంటున్నారు. పార్కులోకి మురుగు నీరు వస్తున్న ఏరియాలో స్థానికంగా చనిపోతున్న జంతువుల కళేబరాలను వేస్తున్నారు. చెత్తను డంప్​చేస్తున్నారు. రాత్రివేళల్లో ఆటో నగర్​ఏరియాలోని ఇండస్ట్రీల నుంచి కొందరు కెమికల్​వేస్టేజ్ ను తెచ్చిపోస్తున్నారు. దీంతో పార్కులోని భూగర్భజలాలు కూడా దెబ్బతింటున్నాయి. ఆటో నగర్ ఏరియాలో ఎన్నో ఫెర్టిలైజర్​కంపెనీలు ఉన్నాయని, వాటి వ్యర్థాల పారబోతపై సంబంధిత అధికారులు ఫోకస్​పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

త్వరలో నోటీసులు ఇస్తాం
ఆటోనగర్ ఏరియాలోని కెమికల్​వ్యర్థాలతో, పై కాలనీల నుంచి మురుగు వచ్చి పార్కులో చేరుతోంది. బాధ్యులు, సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం మురుగు నీరు నిలిచిన ప్రాంతానికి జింకలు వచ్చే అవకాశం లేదు. కూలిపోయిన గోడను తిరిగి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం.
– విష్ణువర్థన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, హయత్ నగర్

మా వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ ​లేదు
పార్కు వైపు వెళ్తున్న మురుగు నీరు కాలనీల నుంచి వస్తున్నది కాదు. అదంతా ఆటోనగర్​ఏరియాలోని డ్రైనేజీ అయ్యి ఉండొచ్చు. ఈ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డ్రైనేజీ వ్యవస్థ సరిగానే ఉంది. కాలనీల్లోని మురుగును కిందికి పంపిస్తున్నాం. పార్కులోకి కాదు.
మారుతీ దివాకర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్

ఊపిరాడక చస్తున్నాం
మా కాలనీ పార్కును ఆనుకొని ఉంటుంది. ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మురుగు పార్కులోకి వస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు మురుగులో కెమికల్ వేస్టేజ్​తెచ్చిపోస్తున్నారు. ఫలితంగా వస్తున్న కంపుతో మా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చనిపోయిన జంతువులను, మెడికల్ వెస్టేజ్​ను తెచ్చి పడేస్తున్నారు. అవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి.
– శ్రీనివాస్ రెడ్డి, జడ్జీస్​ కాలనీ