తెలంగాణ మంత్రి వర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి చోటుదక్కింది. రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మహేందర్‌రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు.
తాండూరు అసెంబ్లీ టికెట్‌ను ఆశించిన మహేందర్‌రెడ్డిని బుజ్జగించారు. రాజీ ఫార్ములాలో భాగంగా మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బర్తరఫ్‌తో 2021 మే నుంచి ఖాళీగా ఉన్న స్థానంలో మహేందర్‌రెడ్డికి తాజాగా అవకాశం ఇచ్చారు. తాండూరు బీఆర్‌ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి కేటాయించారు.
పట్నం మహేందర్‌రెడ్డి నాలుగుసార్లు తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.