కేసీఆర్, హరీశ్ వల్లే బనకచర్ల.. మన వాటాను ఏపీకి తాకట్టు పెట్టిన్రు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కేసీఆర్, హరీశ్ వల్లే బనకచర్ల.. మన వాటాను ఏపీకి తాకట్టు పెట్టిన్రు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సంగారెడ్డి/పరిగి, వెలుగు: బనకచర్ల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే తప్పిదాలు చేసిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్, హరీశ్ రావు సంతకం చేస్తేనే ఆ ప్రాజెక్టును ఏపీ చేపట్టిందని చెప్పారు. వాళ్ల చేతికానితనం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి వచ్చిందని అన్నారు. వాళ్లు చేసిన తప్పులను సరిదిద్దేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. జనహిత పాదయాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగిలోని విద్యారణ్యపురి గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి మహేశ్ గౌడ్ శ్రమదానం చేశారు. మొక్కలు నాటి మీడియాతో మాట్లాడారు. అనంతరం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు.

 ఈ సందర్భంగా జోగిపేటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మహేశ్‌ గౌడ్ మాట్లాడారు. బనకచర్ల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. వాళ్ల హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను హరీశ్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఆనాడు సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్ రావు.. కృష్ణా నీళ్లలో మనకు రావాల్సిన వాటాను ఏపీకి తాకట్టు పెట్టారు. ఇప్పుడు మన వాటాను మళ్లీ వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. మాపై బురదజల్లాలని చూస్తున్నారు. కేసీఆర్, హరీశ్ రావు ఏపీకి తలొగ్గి.. మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయ్యారు. 

దాంతోనే ఆ రాష్ట్రం బనకచర్లను చేపట్టింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే మా ప్రభుత్వం వెంటనే మేల్కొని బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కానీ వాళ్ల తప్పిదాలు బయటకు వస్తాయని బీఆర్ఎస్ నేతలు బట్టకాల్చి మీద వేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క చుక్క కూడా ఏపీకి పోనియ్యమని చెప్పారు. ఆరడుగులు ఉన్న హరీశ్.. నోరు విప్పితే అన్ని అబద్ధాలే మాట్లాడతారని విమర్శించారు. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్నారు. 

‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ కష్టపడితే.. కవిత సంబురాలు చేసుకుంటూ రంగులు పూసుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రస్తుతం కవిత ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదు. ఊసరవెల్లిలా రంగులు మార్చేవారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది” అని అన్నారు. సంక్షేమ పథకాల అమలు తీరు, సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని.. రెండో విడత యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. 

పేదల ఓటు హక్కు కోసం రాహుల్ పోరాటం: మీనాక్షి  

నిరుపేదల ఓటు హక్కును కేంద్ర ప్రభుత్వం తొలగిస్తున్నదని, దీనిపై రాహుల్ గాంధీ చట్టసభల్లో పోరాడుతున్నారని కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్ తెలిపారు. ‘‘బీజేపీ పాలనలో పేదలు ఓటు హక్కు కోల్పోతున్నారు. బిహార్‌‌లో నిరుపేదల ఓట్లను తొలగించడం సిగ్గుచేటు. కేవలం అంబానీ, అదానీకే ఓటు హక్కు ఉంటుందా? దేశ సంపదను ఉన్నత వర్గాలకు బీజేపీ దోచిపెడుతున్నది” అని మండిపడ్డారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే, బీజేపీ నేతలు మాత్రం విడదీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచేలా పని చేస్తున్నాం. సీఎం రేవంత్ సారథ్యంలో సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నాం” అని చెప్పారు.   

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: దామోదర 

ఎన్నికల టైమ్‌లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ‘‘ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. సామాజిక న్యాయం కోసం మా ప్రభుత్వం పని చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలోనే ఉన్నాయి” అని చెప్పారు. ఈ మీటింగ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌‌పర్సన్ నిర్మలారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయిమ్ తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్ పాపాలకు  వడ్డీలు కడుతున్నాం: వివేక్ 

కేసీఆర్ చేసిన పాపాలకు తాము వడ్డీలు కడుతున్నామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మాది ప్రజా ప్రభుత్వం.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. మేం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చాం.. ఏడాదిన్నరలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఈ ఏడాది పూర్తయ్యేసరికి మరో 50 వేల ఉద్యోగాలు ఇచ్చి లక్ష పూర్తి చేస్తాం. పేదల కోసం రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రతి రైతుకు రైతు భరోసా అందించాం. ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చాం” అని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.