97% పెరిగిన మహీంద్రా లాభం

97%  పెరిగిన మహీంద్రా లాభం

న్యూఢిల్లీ: మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్​ ఎం) ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్లో (క్యూ1) రూ.2,773.73 కోట్ల (స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోన్) నికర లాభాన్ని సంపాదించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో వచ్చిన లాభం రూ.1,403.61 కోట్లతో పోలిస్తే 97.6శాతం పెరిగింది. తాజా క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా  రాబడి 23శాతం పెరిగి రూ.19,813 కోట్ల నుంచి రూ.24,368 కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయం గత ఏడాది జూన్‌‌ క్వార్టర్లో రూ.140 కోట్ల నుంచి క్యూ1 లో  రూ.658 కోట్లకు పెరిగింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పుల చెల్లింపునకు (ఇబిటా) ముందు నిర్వహణ లాభం 46.5 శాతం పెరిగి రూ.2,421 కోట్ల నుంచి రూ.3,547 కోట్లకు చేరుకుంది. ఇబిటా మార్జిన్ 12.2శాతం నుంచి 14.6 శాతంకి మెరుగుపడింది. ఎం అండ్​ ఎం  ఆటోమోటివ్ వ్యాపారం ఈబీఐటీ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  5.3శాతం నుంచి 7.5 శాతంకి పెరిగింది. మొత్తం అమ్మకాలు 1,53,462 యూనిట్ల నుంచి 21శాతం పెరిగి 1,86,138 యూనిట్లకు చేరుకుంది. 

తాజా క్వార్టర్​లో వ్యవసాయ పరికరాల సెగ్మెంట్ మార్జిన్ 15.9శాతం నుంచి 17.5శాతంకి ఎగిసింది.  ట్రాక్టర్ విక్రయాలు 1,17,413 యూనిట్ల నుంచి 1,14,293 యూనిట్లకు పడిపోయాయి. ఎస్​యూవీల అమ్మకాలు లక్ష యూనిట్లను దాటాయని, వరుసగా 6వ క్వార్టర్లోనూ మార్కెట్​ లీడర్​గా నిలిచామని కంపెనీ తెలిపింది. ట్రాక్టర్ వ్యాపారంలో అత్యధికంగా 42.9 శాతం మార్కెట్ వాటాను సాధించింది. ఎలక్ట్రిక్​ త్రీవీలర్స్​ వ్యాపారం 65.5శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోతోందని  ఎం అండ్​ ఎం సీఈఓ (ఆటో  ఫార్మ్ సెక్టార్) రాజేష్  జెజూరికర్ అన్నారు. ఈ ఏడాది జూలైలో  ఎం అండ్​ ఎం  ఆర్​బీఎల్​ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.53శాతం వాటాను రూ.417 కోట్లకు కొన్నామన్నారు.