
పద్మారావునగర్, వెలుగు: పని మనిషిగా చేరి, ఇంట్లో బంగారు ఆభరణాలతో ఉడాయించిన మహిళను బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి112 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన కంచర్ల సువర్ణ (48) ఉపాధి కోసం నగరానికి వచ్చి ఇండ్లలో పనులు చేస్తుంది. గతేడాది బోయిన్‌పల్లికి చెందిన దండిబట్ల శివరామకృష్ణ తన అత్తకు సేవలు అందించేందుకు సువర్ణను కేర్ టేకర్ గా నియమించాడు.
అప్పటినుంచి నమ్మకంగా పనిచేస్తున్న ఆమె అనుకోకుండా పనిమానేస్తునట్లు చెప్పింది. సువర్ణ వెళ్లిపోయిన తర్వాత శివరామకృష్ణ కుటుంబ సభ్యులు వృద్దురాలి ఒంటిపై ఉన్న బంగారు నగలు మాయమైనట్లు గుర్తించారు. దీంతో శివరామకృష్ణ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాల ఆధారంగా సోమవారం నిందితురాలిని అరెస్ట్ చేశారు. 24 గంటల్లో కేసును చేధించిన పోలీసులను నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ అభినందించారు.