మారువేషంలో చొరబడి చోరీ చేసిన పనిమనిషి..మేడిపల్లి పోలీస్‌‌స్టేషన్ పరిధిలో ఘటన

మారువేషంలో చొరబడి చోరీ చేసిన పనిమనిషి..మేడిపల్లి పోలీస్‌‌స్టేషన్ పరిధిలో ఘటన
  • వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరార్
  •     నిందితురాలు అరెస్ట్

మేడిపల్లి, వెలుగు: ఇంట్లో పని చేసే మహిళే దోపిడీకి పాల్పడిన ఘటన హైదరాబాద్​లోని మేడిపల్లి పోలీస్‌‌స్టేషన్ పరిధిలో జరిగింది. వృద్ధ దంపతుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని పనిమనిషి ఐదు తులాల బంగారు గొలుసు దోచుకుని పరారైంది.

పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్ సాయి మారుతీనగర్‌‌కు చెందిన సతీశ్​కుమార్ (36), అతని భార్య గురువారం ఉదయం ఉద్యోగాలకు వెళ్లారు. ఇంట్లో తండ్రి అంజయ్య, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తల్లి అరుణ మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించిన పనిమనిషి ముందుగానే పన్నాగం పన్ని మధ్యాహ్నం ఇంటికి వచ్చింది.

మారు వేషంలో చొరబడి కిచెన్‌‌లో ఉన్న అంజయ్య బయటకు రాకుండా తలుపుకు గడియ వేసింది. తర్వాత బెడ్​రూంలో ఉన్న వృద్ధురాలి మెడలోని సుమారు 5 తులాల బంగారు గొలుసును లాక్కొని, బట్టలు మార్చుకుని అక్కడి నుంచి పరారైంది. మొదట గుర్తుతెలియని వ్యక్తుల పని అనుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా నిందితురాలు పనిమనిషేనని గుర్తించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని రిమాండ్‌‌కు తరలించారు.