
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో రాజకీయ సభలలో ఎన్నడూ జరగనంత ప్రాణ నష్టం జరిగింది. హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో దాదాపు 30 మందికి పైగా చనిపోవడం సంచలనంగా మారింది. ఇందులో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. ఆస్పత్రుల్లో ఇంకా 50 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో పది పదిహేను మంది పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.
విజయ్ పార్టీ ఏర్పాటు చేసిన సభలో ఇంత పెద్ద ప్రమాదం జరగటానికి కారణం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే సభకు 10 వేల మందికి మాత్రమే అనుమతి ఉండగా.. 50 వేల మంది వరకు వచ్చినట్లు అంచనా. హీరో విజయ్ ను చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు.
అయితే విజయ్ రావాల్సిన సమయానికంటే ఆరు గంటలు లేటుగా రావడంతో అభిమానులు పడిగాపులు కాశారు. ఆకలి దప్పికల నడుమ అప్పటికే అలసటతో ఉన్న జనం.. నీళ్ల బాటిళ్ల కోసం తోసు కోవడంతో గందరగోళం చెలరేగిందని తమిళమీడియా కథనాలు వెలువుడుతున్నాయి. దప్పికతో జనాలు స్పృహతప్పి పడిపోయే పరిస్థితులు ఉన్నట్లుగా భావించి.. జనంలోపలికి విజయ్ వాటర్ బాటిల్స్ విసరడంతో.. అప్పటికే టైట్ గా ఉన్న పరిస్థితుల్లో.. అభిమానులు బాటిల్స్ కోసం ఎగబడ్డారు. దీంతో తోపులాట స్టార్టయినట్లు సమాచారం.
మరోవైపు.. సభలో 9 ఏళ్ల పాప మిస్సైనట్లు సమాచారం రావడంతో.. అమ్మాయిని వెతికి పెట్టాలని విజయ్ స్పీచ్ మధ్యలో పోలీసులకు సూచించారు. కార్యకర్తలు కూడా సహాయం చేస్తారని విజయ్ చెప్పారు. దీంతో పాప స్పృహ తప్పిపడిపోయిందనే మాటలతో పాపను వెతికే క్రమంలో ఆందోళన చెందటంతోనే.. తోపులాట జరిగిందని మరో వర్షన్ ప్రకారం తెలుస్తోంది.
ఏదైతేనేం.. శనివారం (సెప్టెంబర్ 27) జరగకూడని నష్టం జరిగింది. విజయ్ రాజకీయ సభలో 30 మందికి పైగా చనిపోయారు. తొక్కిసలాటలో గాయపడిన వారి హాహాకారాల మధ్య ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి.
ఒకవైపు 10 వేల మందికి అనుమతి తీసుకుని 50 వేల మందితో సభ నిర్వహించటం నిర్వాహకుల తప్పయితే.. మరోవైపు.. హీరో అంటే వేలం వెర్రితో.. ముందూ వెనుక ఆలోచించకుండా.. వెర్రి తలలెత్తిన ఫ్యానిజంతో అభిమానులు ఎగబడటం మరో పొరపాటు. కారణం ఏదైనా అమాయకుల ప్రాణాలు పోవడంతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది.
ఈ ఘోర విషాదంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. సభలో ఇంతమంది చనిపోవడం కలచివేస్తోందని అన్నారు. గాయపడిన వారికి వైద్యం అందిస్తున్నామని.. రేపు (సెప్టెంబర్ 28) క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు చెప్పారు. సీఎం సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తొక్కిసలాటపై స్పందించారు. ఇదొక దురదృష్ట ఘటనగా ఆయన పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్ భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యలకు సానుభూతి ప్రకటించారు. ఇ క ఈ ఘటనపై డీటైల్డ్ రిపోర్టు అందించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది కేంద్ర హోంశాఖ.