
- ఉమ్మడి మెదక్ జిల్లాలో దేవుళ్లకు శఠగోపం
- భారీగా ఆదాయం వచ్చే చోట ఈఓల చేతివాటం
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి మెదక్జిల్లాలో ప్రధాన ఆలయాలకు రెగ్యులర్ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈఓ)లు లేరు. 36 ప్రధాన ఆలయాలు ఉంటే ఐదుగురు మాత్రమే ఈఓలు ఉన్నారు. మిగతా ఆలయాల బాధ్యత కూడా వారికి అప్పగించడంతో భారీ ఆదాయం వచ్చే వద్ద కొందరు ఈఓలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ఆలయాల్లో ఈఓలు దేవుళ్లకే శఠగోపం పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండోమెంట్ పరిధిలో మొత్తం 2,786 దేవాలయాలు ఉన్నాయి.
ఇందులో 36 ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే ప్రముఖ టెంపుల్స్ (అసెస్మెంట్), 950 ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన గుళ్లు, 1,800 దేవాలయాలు (పబ్లికేషన్స్) జాతర్ల టైంలోనే గుర్తించేవి ఉన్నాయి. ప్రధాన ఆలయాలకు 36 మంది ఆలయ ఈవోలు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కో ఈఓకు ఆరేడు ఆలయాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే జిల్లాకు ఒక ఇన్ స్పెక్టర్ చొప్పున ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక్కరు మాత్రమే ఉన్నారు.
అంతా వారి ఇష్టం..
- ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో ఈఓలదే ‘ఆడింది ఆట పాడింది పాట’గా మారింది. పలు పెద్ద టెంపుల్స్‌కు వివిధ పద్దుల ద్వారా కోట్లలో ఆదాయం సమకూరుతుండటంతోపాటు జాతరల సమయంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోంది. ఆయా ఆలయాలకు పాలక మండళ్లు ఉన్నప్పటికీ ఈఓలకు మాత్రమే చెక్ పవర్ ఉండటంతో నిధుల వినియోగం విషయంలో ఈఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో వరుసగా జరుగుతున్న అవకతవకలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- మూడు రోజుల కింద మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి సంబంధించి సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వెండిని హైదరాబాద్ మింట్ కాంపౌండ్ నుంచి ఇన్సూరెన్స్ చేయకుండా, సెక్యురిటీ లేకుండా ఈఓ శ్రీనివాస్ నింబంధనలకు విరుద్ధంగా ఇంటికి తీసుకెళ్లడం
- వివాదాస్పదమైంది.
- కౌడిపల్లి మండలం తునికి నల్లపోచమ్మ దేవాలయానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి బహుకరించిన ఐదు తులాల బంగారు నెక్లెస్, కిలో పరిమాణం ఉన్న వెండి తాంబాలం అడ్రస్ లేకుండా పోయాయి. గతంలో ఆలయ ఈఓగా పనిచేసిన శ్రీనివాస్ బదిలీ అయి 2019 నవంబర్ 22న కొత్తగా వచ్చిన తనకు చార్జి ఇచ్చినా బంగారు, వెండి ఆభరణాలు అప్పగించలేదని ఇన్చార్జి ఈఓ మోహన్ రెడ్డి గత జులై 11న ఎండోమెంట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఈఓ శ్రీనివాస్ ను అడిగినా వాటిని తనకు అప్పగించలేదని ఆయన ఫిర్యాదులో
- పేర్కొన్నారు.
- శివ్వంపేట మండలంలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయానికి నర్సాపూర్ బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్కాలేజీ మేనేజ్మెంట్బహూకరించిన దాదాపు నాలుగు తులాల బంగారు గొలుసు ఈఓ శ్రీనివాస్ దగ్గరే ఉందని ఆలయ కమిటీ చైర్మన్ ఆంజనేయ శర్మ తెలిపారు. ఏడుపాయల ఆలయం, తునికి నల్లపోచమ్మ ఆలయానికి సంబంధించిన బంగారం, వెండి అంశం వివాదాస్పదమైన నేపథ్యంలో ఈఓ శ్రీనివాస్ చాకరిమెట్ల ఆలయానికి సంబంధించిన బంగారు గొలుసును సోమవారం శివ్వంపేట ఇండియన్ బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం గమనార్హం.
- సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా తరుచూ అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. ఆలయానికి పాన్ కార్డు ఉన్నా లేదని చిత్రీకరించి టీడీఎస్ డబ్బులు ఏడు లక్షలు వ్యక్తిగత అకౌంట్లకు మళ్లించిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించడంతో పాటు ఇటీవల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు దారి మళ్లించిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.
- సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకి ఆలయ ఈవో శ్రీనివాస్ మూర్తి ఏడాది కింద కారుణ్య నియామకం విషయంలో డబ్బులు డిమాండ్ చేసి సస్పెండ్ అయ్యారు.
ఆర్జేసీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు
ఏడుపాయల ఈవోపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్ జేసీ) రామకృష్ణారావు ఏడుపాయలలో, మెదక్ బ్యాంక్‌లో ఎంక్వైరీ చేశారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దానికి అనుగుణం చర్యలు తీసుకుంటారు.
- శివరాజ్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్