ఐపీఓలతో కంపెనీలకు రూ.62 వేల కోట్లు

ఐపీఓలతో కంపెనీలకు రూ.62 వేల కోట్లు
  • 2024లో 19 శాతం పెరిగిన పబ్లిక్ ​ఇష్యూలు
  • మొత్తం 76 ఐపీఓలు

న్యూఢిల్లీ:  సెకండరీ మార్కెట్లు బలంగా ఉండటం, రిటైల్ ఇన్వెస్టర్ల బలమైన భాగస్వామ్యం,  సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ ఇన్వెస్ట్​మెంట్ల వల్ల  గత ఆర్థిక సంవత్సరంలో 76 కంపెనీలు మెయిన్‌‌‌‌బోర్డ్ ఐపీఓల ద్వారా రూ. 62 వేల కోట్లు సేకరించాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది19 శాతం పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 37 కంపెనీలు రూ.52,115 కోట్లు సేకరించాయి.

కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ భారీ ఎత్తున ఐపీఓలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేశీయ మూలధన పెరుగుదల, మెరుగైన పాలనా పద్ధతులు, భారీగా విదేశీ పెట్టుబడులు, అనుకూలమైన ప్రభుత్వ విధానాలు వంటివి ఇందుకు కారణాలని పాంటోమత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ తన నివేదికలో పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా కంపెనీలు రూ.లక్ష కోట్ల వరకు సేకరించే అవకాశాలు ఉన్నాయని  సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ లునావత్ తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ మొదటి రోజు లాభాలు సగటున 29 శాతం వరకు ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో  9 శాతం ఉన్నాయి. 70 శాతం లేదా 55 స్టాక్‌‌‌‌లు ఇప్పటికీ వాటి ఇష్యూ ధర కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి.   గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన ఎక్కువగా ఉంది. 

గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ దరఖాస్తుల సగటు సంఖ్య 0.6 మిలియన్ల నుంచి 1.3 మిలియన్లకు పెరిగింది.  పోస్ట్-లిస్టింగ్ పనితీరు బలంగా ఉండటమే ఇందుకు కారణం. చిన్న,  మధ్య తరహా పరిశ్రమలు (ఎస్​ఎంఈలు) విభాగంలో గత ఏడాది 200 కంపెనీలు రూ. 5,838 కోట్లను సమీకరించాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 125 ఐపీఓలు రూ. 2,235 కోట్లు సేకరించాయి. అతిపెద్ద ఎస్​ఎంఈ ఐపీఓ కేపీ గ్రీన్ ఇంజినీరింగ్ రూ. 180 కోట్లు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో, ఎన్​ఎస్​ఈ  బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ–50 దాదాపు 29 శాతం పెరిగింది.