2011 తర్వాత ఇదే పెద్ద భూకంపం..

 2011 తర్వాత ఇదే పెద్ద భూకంపం..

టోక్యో: రష్యా తూర్పు తీరంలోని కామ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో పసిఫిక్​ మహా సముద్రంలో బుధవారం ఉదయం 8.25 గంటలకు పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 8.8 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపంతో రష్యా తీరం నుంచి జపాన్, హవాయి, అమెరికా పశ్చిమ తీరం వరకూ సునామీ అలలు పోటెత్తాయి. ఈ భూకంపం ధాటికి రష్యా, జపాన్‎లో పలువురు గాయపడ్డారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడికాలేదు. 

భూకంపం తీవ్రత దృష్ట్యా కొన్ని గంటల నుంచి ఇరవై నాలుగు గంటల వరకూ సునామీ ముప్పు పొంచి ఉంటుందని అలాస్కాలోని నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో జపాన్ తీర ప్రాంతంతో పాటు హవాయి దీవుల్లో లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

హవాయిలోని హొనొలులూలో ప్రజలు ఒకేసారి కార్లలో సురక్షిత ప్రాంతాలకు తరలడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‎తో జామ్ అయ్యాయి. కామ్చాట్కా ద్వీపకల్పంలోని కామ్చాట్స్కీ సిటీకి 120 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో  21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని రష్యన్ అధికారులు వెల్లడించారు.

కామ్చాట్కా తీరాన్ని 3 నుంచి 4 మీటర్ల ఎత్తున సునామీ అలలు తాకాయని తెలిపారు. రష్యాలోని కామ్చాట్కా, కరిల్ ఐలాండ్స్ తీరానికి 10 నుంచి 15 మీటర్ల ఎత్తున సునామీ అలలు రావచ్చని తొలుత హెచ్చరికలు జారీ చేసినా.. తర్వాత సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించారు. భూకంపం ప్రభావంతో 7.5 తీవ్రతతో ప్రకంపనలు రావచ్చని, ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని హెచ్చరించారు.

జపాన్‎లో వణికిన జనం..  

జపాన్‎లో 2011 నాటి పెను సునామీని తలచుకుని భయపడిన ప్రజలు ఎవాక్యుయేషన్ సెంటర్లకు పరుగులు తీశారు. తాజా భూకంపం ధాటికి జపాన్ ఉత్తర ద్వీపం హొకాయిడోకు అర మీటర్ ఎత్తున సునామీ అలలు వచ్చాయి. టోక్యో తీరాన్ని కూడా 20 సెంటీమీటర్ల ఎత్తైన అలలు తాకాయి. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు సైతం 2 నుంచి 5 అడుగుల ఎత్తున సునామీ అలలు తాకాయి.

కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ స్టేట్, కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, హవాయిలో ముందుగా సునామీ హెచ్చరికలు జారీ అయినా.. తర్వాత ఉపసంహరించుకున్నారు. సునామీ ప్రమాదంలేకున్న హవాయి దీవుల్లోని బీచ్​లకు ప్రమాదకరంగా అలలు పోటెత్తవచ్చని, తదుపరి అడ్వైజరీ జారీ అయ్యేంత దాకా తీర ప్రాంతాలకు వెళ్లొద్దంటూ అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు.

2011 తర్వాత ఇదే పెద్ద భూకంపం..

జపాన్ తీరంలో 2011లో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను విలయం సృష్టించిన విషయం తెలిసిందే. జపాన్ తీర ప్రాంతాలను సునామీ ముంచెత్తగా.. ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి రేడియేషన్ లీక్ కావడంతో లక్షలాది మంది ప్రజలు ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. తాజా భూకంపంతో న్యూక్లియర్ ప్లాంట్లకు ఎలాంటి నష్టం జరగలేదని జపాన్ అధికారులు తెలిపారు.

కాగా, తాజా భూకంపంతో భవనాలు ఊగిపోవడం, తీర ప్రాంతాల్లోకి అలలు పోటెత్తడం వంటి దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్‎లు వైరల్ అయ్యాయి. కామ్చాట్కాలోని ఓ హాస్పిటల్‎లో ఓ పేషెంట్‎కు డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండగా.. భూకంపంతో ఆపరేషన్ థియేటర్ ఊగిపోయిన దృశ్యం కూడా వైరల్ అయింది. పేషెంట్‎ను, ఎక్విప్ మెంట్లను కదలకుండా డాక్టర్లు గట్టిగా పట్టుకోవడం వీడియోలో కనిపించింది. భూకంపం తర్వాత డాక్టర్లు ఆ పేషెంట్‎కు ఆపరేషన్‎ను పూర్తి చేశారని రష్యన్ మీడియా వెల్లడించింది.