తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం

తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం

తిరువనంతపురం: తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రాజస్థాన్‌లోని కోటా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా B1 ఏసీ కోచ్, ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. B1 కోచ్ పూర్తిగా కాలిపోయింది.

ప్రయాణికుల వస్తువులు కూడా పూర్తిగా కాలిపోయాయి. మంటలను గమనించిన వెంటనే ప్రయాణికులుసురక్షితంగా బయటపడటంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఇంజన్ నుండి బోగీలను వేరు చేశారు. ఈ రైలు శుక్రవారం తిరువనంతపురం నుంచి బయలుదేరింది. ఆదివారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అగ్నిప్రమాదం కారణంగా రైలును నిలిపివేశారు.

తిరువనంతపురం టూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో మలయాళీలు ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రైలులో చాలా మంది మలయాళీలు ఉన్నారు. మలయాళీలతో సహా ప్రయాణికులు ప్రస్తుతం రాజస్థాన్లో చిక్కుకుపోయిన పరిస్థితి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణను ప్రకటించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.