ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ! ప్రభుత్వ, అసైన్డ్, ఎండోమెంట్, అటవీ భూములపై ఫోకస్

ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ! ప్రభుత్వ, అసైన్డ్, ఎండోమెంట్, అటవీ భూములపై ఫోకస్
  • సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భూ అక్రమాలపై సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ రిపోర్ట్​
  • నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్​లో వర్క్ 
  • కలెక్టర్ అథెంటికేషన్, రిపోర్ట్​లు లేకుండా.. బోగస్​ పత్రాలు, అర్ధరాత్రి వేళల్లో మారిన భూముల వివరాల నమోదు
  • ప్రభుత్వ, అసైన్డ్, ఎండోమెంట్, అటవీ భూములపై ఫోకస్​
  • నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న ఆడిట్ ​సంస్థ

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల లావాదేవీలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన భూమార్పిడిలపై నెల రోజులుగా నిర్వహించిన ఈ ఆడిట్ రిపోర్ట్‌‌ను నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఈ రెండు జిల్లాల్లో గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు, మాజీ మంత్రులు అయిన కేటీఆర్, హరీశ్ రావుకు చెందిన నియోజకవర్గాలు భాగం కావడం వల్ల, ఇక్కడ భూముల అక్రమాలపై మరింత ఆసక్తి నెలకొంది.  ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం కేరళకు చెందిన ‘‘సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్’’ అనే సంస్థకు అప్పగించింది. ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో విస్తృత అనుభవం ఉన్న ఈ సంస్థ నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వర్క్ పూర్తి చేసింది. డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా భూముల లావాదేవీల్లో జరిగిన అవకతవకలను గుర్తించారు. ఆ తరువాత సాంకేతిక సమాచారాన్ని మండల, డివిజన్ ఆఫీసుల్లో ఉన్న రికార్డులతో సరిపోల్చి నిర్ధారించనున్నారు. ఈ రెండు జిల్లాల తరువాత భూముల విలువ కోట్ల రూపాయల్లో ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్​గిరి, యదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లో భూములపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నారు.

సిద్దిపేట హైవే పక్కన 484 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు

ఈ ఆడిట్‌లో ముఖ్యంగా ప్రభుత్వ, అసైన్డ్, ఎండోమెంట్, అటవీ భూములపై దృష్టి సారించారు. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కలెక్టర్ అథెంటికేషన్, సరైన రిపోర్ట్‌లు లేకుండా అర్ధరాత్రి వేళల్లో భూముల వివరాలు మారిన వాటిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి? ఎందుకు మారాయి? బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారా? పనివేళల్లో జరిగిన లావాదేవీలెన్ని? అర్ధరాత్రి తర్వాత ఏయే లావాదేవీలు జరిగాయి? ఏ కంప్యూటర్ నుంచి లావాదేవీలు జరిగాయి? అనుమతి ఇచ్చింది ఎవరు? వంటి వివరాలతో విశ్లేషించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడానికి కొద్ది రోజుల ముందు సిద్దిపేట జాతీయ రహదారికి సమీపంలోని ప్రైమ్ ఏరియాలో ఉన్న 484 ఎకరాల ప్రభుత్వ భూమిని బోగస్ పత్రాలతో ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా బదిలీ చేసినట్లు గుర్తించారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకెళ్లి అనుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ, ఆ తర్వాత తప్పుడు పత్రాలతో మళ్లీ ప్రైవేట్ పట్టాగా మార్చినట్లు ఆ వివరాలను ఫోరెన్సిక్ ఆడిట్​లో గుర్తించినట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లాలో 300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇంకా మరికొన్ని ప్రభుత్వ, నిషేధిత జాబితాలో ఉన్న భూములు సరైన ఆధారాలు లేకుండానే పట్టా భూములుగా మార్చినట్లు తెలిసింది. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక అందిన తర్వాత భూదాన్, దేవాదాయ, అసైన్డ్, అటవీ, ప్రభుత్వ భూముల్లో జరిగిన అవకతవకలు బయటపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది.

ఇలా డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్

డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ అనేది సాంకేతిక ఆధారాల సహాయంతో డిజిటల్ లావాదేవీలలోని అక్రమాలను, అవకతవకలను గుర్తించే ప్రక్రియ. ఈ ధరణి ఆడిట్‌లో డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఆధారంగా ఎక్స్​పర్ట్స్​లావాదేవీలను విశ్లేషించారు. ఇందులో లావాదేవీలు జరిగిన కచ్చితమైన సమయం (పనివేళల్లో జరిగాయా లేక అర్ధరాత్రి తర్వాత జరిగాయా), అవి ఏ కంప్యూటర్ (ఐపీ అడ్రస్) నుంచి జరిగాయి, ఆ సమయంలో లాగిన్ అయిన యూజర్ ఐడీ ఎవరిది, ఎవరు అనుమతి ఇచ్చారు వంటి అంశాలను పరిశీలిస్తారు. భూమిని మార్చడానికి ఉపయోగించిన రిపోర్ట్​లు, బోగస్ డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను సాంకేతిక సమాచారంతో సరిపోల్చి ఏం జరిగిందో నిర్ధారిస్తారు. ఈ ఫోరెన్సిక్ ఆడిట్​లో భూదాన్, దేవాదాయ, అసైన్డ్, అటవీ, ప్రభుత్వ భూముల్లో రికార్డుల తారుమారు వెనుక ఉన్న కుంభకోణాలను వెలికి తీయాలని ప్రభుత్వం భావిస్తున్నది.