నిండు కుండలా ప్రాజెక్టులు..సాగర్, శ్రీశైలం, ఎల్లంపల్లికి 4 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద

నిండు కుండలా ప్రాజెక్టులు..సాగర్, శ్రీశైలం, ఎల్లంపల్లికి 4 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. కృష్ణాతో పాటు గోదావరి బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన మహారాష్ట్రలోని కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఆయా బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు 4 లక్షల క్యూసెక్కుల దాకా వరద వస్తుండగా.. శ్రీరాంసాగర్​ ఇన్​ఫ్లో​ 3 లక్షల క్యూసెక్కులకు చేరువలో ఉంది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. 

భద్రాచలం వద్ద 37 అడుగుల ఎత్తులో నది ప్రవహిస్తున్నది. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు 2.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 39 గేట్లు ఎత్తి 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లికి 4.44 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా..  35 గేట్లు ఎత్తి 4.50 లక్షల క్యూసెక్కులను దిగువకు రిలీజ్​ చేస్తున్నారు. 

వరద పరిస్థితిని బట్టి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలే ఏర్పాట్లను చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు 3.90 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో​ వస్తుండగా.. 4.43 లక్షలు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్​ ప్రాజెక్టుకు 4.10 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో​వస్తుండగా.. 26 గేట్లు ఎత్తి 4.08 లక్షలు వదులుతున్నారు. 

రాష్ట్రంలో అధిక వర్షపాతం

గత పది రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండడంతో.. ఇన్నాళ్లూ లోటులో ఉన్న వర్షపాతం మొత్తం కవరైపోయింది. ప్రస్తుతం సాధారణం కన్నా అధిక వర్షపాతం రికార్డయింది. ఇప్పటిదాకా 48.9 సెంటీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక వర్షపాతం రికార్డయింది. మెదక్, జోగుళాంబ గద్వాల, సిద్దిపేట, హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ, వికారాబాద్, మేడ్చల్​ మల్కాజిగిరి, సంగారెడ్డి, వరంగల్, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాల్లో అధిక వర్షపాతం రికార్డయింది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 


రాష్ట్రానికి ఎల్లో అలర్ట్  

వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. వర్షాల తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్​లో మోస్తరు వర్షం పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. సోమవారం అర్ధరాత్రి ములుగు, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్​ భూపాలపల్లి, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. 

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 18.9 సెంటీమీటర్లు, మంగపేటలో 15.5, వెంకటాపురంలో 12.1, కన్నాయిగూడెంలో 10.4, తాడ్వాయిలో 10.2, ఆదిలాబాద్​ జిల్లా జైనద్​లో 12, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడిలో 11.5, ఆదిలాబాద్​ జిల్లా సాత్నాలలో 11.1, సిరికొండలో 9.9, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా పలమెలలో 8.4, కామారెడ్డి జిల్లా బిక్నూరులో 7.3, మంచిర్యాలలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.