మగ బిడ్డ పుట్టకుంటే తల్లిది తప్పా..?

మగ బిడ్డ పుట్టకుంటే తల్లిది తప్పా..?

న్యూఢిల్లీ: ఓ మహిళపై వరకట్న వేధింపుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక సూచన చేసింది. బిడ్డ లింగాన్ని పురుషుడి క్రోమోజోములే నిర్ధారిస్తాయన్న విషయంపై సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అడిగినంత క‌‌‌‌ట్నం ఇవ్వలేదని, ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చిందన్న కోపంతో ఓ మహిళపై అత్తామామలు వేధింపుల‌‌‌‌కు పాల్పడ్డారు. భర్త కూడా ఆ వేధింపుల్లో పాలు పంచుకున్నాడు.  దీంతో ఆ మ‌‌‌‌హిళ ఆత్మహత్య చేసుకుంది. 

ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు హైకోర్టుకు వెళ్లాడు. ఈ  కేసును  ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణ  కాంత శర్మ ఇటీవల విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రజలు జెనెటిక్స్ ను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ‘‘మహిళల్లో XX, పురుషుల్లో XY క్రోమోజోములు ఉంటాయి. పురుషుడి నుంచి వచ్చే ఏ క్రోమోజోమ్ పిండానికి చేరుతుందనే దానిని బట్టే బిడ్డ లింగం నిర్ధారణ అవుతుంది. దీనిపై  ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది”అని పేర్కొన్నారు. భర్త వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని, అందువల్ల నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదన్నారు.