
మీరు హెల్మెట్ లేకుండా రోడ్డెక్కుతున్నారా ? ఓవర్ స్పీడ్ తో దూసుకెళుతున్నారా ? అయితే.. ట్రాఫిక్ పోలీసులు మీ భరతం పట్టేందుకు రెడీ అయ్యారు. నిర్లక్ష్యంగా ఉండే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం... 2022, మే 23వ తేదీ సోమవారం నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నారు. రాజధాని నగరం చెన్నై హైకోర్టు ఇటీవలే పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ద్విచక్ర వాహన దారులకు హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. బైక్‌పై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణించినా.. హెల్మెట్ కంపల్సరీ అని తెలిపింది. కారులో సీటు బెల్టు ధరించని వారిపై, అతివేగంతో ప్రయాణించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ వారికి సూచించింది.
రాజధాని నగరం చెన్నై కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. చెన్నైలో 300కు పైగా ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. పోలీసులు సైతం హెల్మెట్ ధరించాల్సిందేనని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి మే 15వ తేదీ వరకు దాదాపు 1000కి పైగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో 98 మంది హెల్మెట్ లేకుండా ఉండడంతో మరణించినట్లు నివేదికలు వెల్లడించాయి. 841 మంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో.. రోడ్డు ప్రమాదాల కట్టడికి హైకోర్టు నడుం బిగించింది. హెల్మెట్ వాడకం తప్పనిసరిగా చేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది.
మరిన్ని వార్తల కోసం : -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కాశ్మీర్ యువకుడు
ఢిల్లీలో దంచి కొట్టిన వాన