పార్టీ నడపడానికే సినిమాలు చేస్తున్నా

పార్టీ నడపడానికే సినిమాలు చేస్తున్నా

పార్టీ నేతలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

అమరావతి, వెలుగుజనసేన పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నానని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. తనకు వచ్చే ఆదాయంపైనే కుటుంబం, పార్టీ ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయని, అందుకే సినిమాలు చేయక తప్పడం లేదని చెప్పారు. రాజకీయాల్లో వేలకోట్లు సంపాదించాలనే ఆలోచనతో రాలేదని, సొంత డబ్బు ఖర్చు చేసైనా వ్యవస్థను మార్చాలనే వచ్చానని చెప్పారు. తన దగ్గర వేల కోట్లు, వందల కోట్లు ఆదాయం తెచ్చే ఫ్యాక్టరీలు లేవని, సినిమాలు చేసి పార్టీని పోషిస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో లాబీయింగ్ చేసి కాంట్రాక్టులు ఇప్పించి డబ్బులు తీసుకుని జనసేన పార్టీని నడపడం లేదన్నారు.

ఆదివారం అమరావతిలోని పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ స్థితిగతులు, స్థానిక సంస్థల ఎన్నికలకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..టీడీపీ, వైసీపీ డ్రామాలు ప్రజలకు తర్వలోనే అర్థమవుతాయని, అప్పుడు వారికి జనసేన ఏకైక ఆప్షన్ గా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం రూ. 2 వేలు ఇస్తేనే ఓటేసేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లే ట్రెండ్ నడుస్తోందని.. కొద్ది మందిలో ఉన్న ఈ ధోరణి మారాలన్నారు. లేకుంటే మరో పదేళ్లలో రాష్ర్ట భవిష్యత్ నాశనం అయిపోతుందని హెచ్చరించారు. ఏపీ భవిష్యత్తు కోసమే జనసేన బీజేపీతో కలిసి నడుస్తోందని చెప్పారు. జగన్ కేసుల కోసం బీజేపీతో కలవాలని వైసీపీ డ్రామాలు చేస్తోందన్నారు.