 
                                    బషీర్‌బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ప్రకటించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత బడుగు బలహీన వర్గాలపై ఉందని చెప్పారు. స్థానికుడైన నవీన్ యాదవ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ , ప్రజల బాధల్లో భాగస్వామ్యం అయ్యాడని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాలకు టికెట్లు ఇచ్చాయని, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తూ బీసీకి టికెట్ ఇచ్చిందన్నారు.
నవీన్ యాదవ్ గెలుపు కోసం జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తామని చెన్నయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్‌లో సరైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు సామాజిక న్యాయం దిశగా భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుండడంతో పాటు మతోన్మాద శక్తులు బలపడకుండా చూడాల్సిన బాధ్యత లౌకికవాదులపై ఉందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర్లు తెలిపారు.

 
         
                     
                     
                    