
సూర్యాపేట, వెలుగు: ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా మాలమహానాడు అధ్యక్షులుగా పెనపహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లెద్దు వినయ్ కు నియామకపత్రం అందజేసి మాట్లాడారు.
జనాభా లెక్కలు చేయకుండానే మాలలకు 5శాతం, మాదిగలకు 9శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగాల్లో మాలలకు 28 పోస్టులుంటే మాదిగలకు 100 పోస్టులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పున:సమీక్షించాలన్నారు.
జీఓ 99ని సవరించి మాలలతో పాటు గ్రూప్ 3లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలన్నారు. నవంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించే మాలల రణభేరి మహాసభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు మాల ప్రజా ప్రతినిధులంతా హాజరు కావాలని లేని పక్షంలో వారి ఇండ్లు ముట్టడిస్తామన్నారు.
కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు భూర్గుల వెంకటేశ్వర్లు, మాల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పర్వి కోటేశ్వర రావు, నల్గొండ జిల్లా అధ్యక్షుడు లక్మాల మధుబాబు, ప్రకాశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, పాలపాటి సుమలత, యాదాద్రి జిల్లా మహిళా అధ్యక్షురాలు కే లలిత, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్క సైదులు, జిల్లా అధ్యక్షుడు అనుములపురి కృష్ణ పాల్గొన్నారు.