ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి : మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్

ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి : మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెంటనే సవరించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్ డిమాండ్ చేశారు. జీవో నంబర్ 99 ద్వారా అన్యాయానికి గురవుతున్న 58 ఉప కులాలకు న్యాయం చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్​లో మాల సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవగాహన రాహిత్యంతో ఎస్సీ వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గానికి నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. మాల కులానికి మరో రెండు శాతం అదనపు రిజర్వేషన్లు కేటాయించాలని, రెండు రోస్టర్ పాయింట్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న వర్గీకరణ వల్ల ఐదు నెలలుగా మాలలు ఉన్నత విద్య అడ్మిషన్లు, ఉద్యోగ ప్రమోషన్లలో తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 ఉద్యోగ నోటిఫికేషన్ లో మాలలకు ఉద్యోగాలు కూడా దక్కడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బేర బాలకిషన్, నల్లాల కనకరాజు, మంత్రి నరసింహయ్య, మాదాసు రాహుల్, స్వామి, రావుల అంజన్న, వేణుగోపాల్, రాజేశ్, దేవయ్య, అనంతయ్య, డేనియల్  తదితరులు ఉన్నారు.