స్పీకర్ తీర్పు.. రాజ్యాంగ హత్య: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

స్పీకర్ తీర్పు.. రాజ్యాంగ హత్య: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య హత్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని చేతిలో పుస్తకం పట్టుకొని దేశమంతా తిరుగుతున్న కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, ఇప్పుడు ఆ పార్టీనే చట్టానికి, రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని పదే పదే చెప్పే కాంగ్రెస్ పెద్దలు.. చివరకు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ వ్యవస్థను కూడా ప్రభావితం చేశారని ఆరోపించారు.

సీఎం ఒత్తిడికి స్పీకర్ లొంగిపోయిన్రు: బీజేఎల్పీ నేత ఏలేటి 

సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిళ్లకు లొంగి స్పీకర్ పనిచేస్తున్నారని బీజేఎల్​పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ‘‘స్పీకర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అవహేళన చేయడం సరికాదు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. తొమ్మిది నెలలు కాలయాపన చేయడానికి కారణం ఏంటి? ఎల్లుండి వరకు తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు హెచ్చరించడంతో.. ఆ ముగ్గురిలో ఒక ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు. వెంకట్రావుపై ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్ కొట్టేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి తీర్పు ఏమైంది’’అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు: ఎంపీ లక్ష్మణ్

పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీర్పు.. రాజ్యాంగ విరుద్ధమైందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. స్పీకర్ పై ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తీర్పు ఇప్పించిందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ఈ తీర్పుపై కాంగ్రెస్ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారని ఫైర్ అయ్యారు.