కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్లు లక్ష్యసేన్, హెచ్. ఎస్ ప్రణయ్.. మలేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో నిరాశపర్చారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ లక్ష్యసేన్ 17–21, 11–21తో మహ్మద్ జాకి ఉబైదుల్లా (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. 43 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ తొలి గేమ్‌లో మాత్రమే పోటీ ఇచ్చాడు. ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో 14–14 వరకు గేమ్ నువ్వా–నేనా అన్నట్లుగా సాగింది. ఆ తర్వాత లక్ష్య క్రమంగా వెనకబడ్డాడు. రెండో గేమ్‌లో 3–3 స్కోరు తర్వాత ఇండియన్ ప్లేయర్ ఏ దశలోనూ పుంజుకోలేదు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 17–21, 22–20, 22–24తో ఆరోసీడ్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు.
అలెక్స్ లీనియర్ (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో స్కోరు 21–15, 6–1 వద్ద ఉన్నప్పుడు కిరణ్ జార్జ్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. తరుణ్ మానెపల్లి 21–17, 14–21, 8–21తో వాంగ్ పో వీ (చైనీస్‌తైపీ)చేతిలో పరాజయం చవిచూశాడు. విమెన్స్ సింగిల్స్‌లో అష్మితా చాలియా 21–16, 21–13తో తలితా రామ్‌దాని విరావన్ (ఇండోనేసియా)పై, మాళవిక బన్సోద్ 21–17, 16–21, 21–9తో యువోని లీ (జర్మనీ)పై, దేవికా సిహాగ్ 19–21, 21–18, 21–19తో పార్క్ యున్ (కొరియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఇషారాణి బారువా 17–21, 21–14, 18–21తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో, అన్మోల్ ఖర్బ్ 21–13, 16–21, 19–21తో లైన్ హెజ్‌మార్క్ (డెన్మార్క్) చేతిలో, తన్యా హేమంత్ 19–21, 7–21తో హుయాంగ్ చింగ్ పింగ్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి–రాధిక శర్మ 16–21, 21–14, 21–15తో అలెగ్జాండర్ డున్–జూలీ మెక్‌పర్సన్ (స్కాట్లాండ్)పై గెలవగా, అశిత్ సూర్య–ప్రముతేశ్ 13–21, 18–21తో బాబీ సెటియాబుడి–మిలాటి ఒక్టావియాంటి (ఇండోనేసియా) చేతిలో, రుత్విక శివాని–రోహన్ కపూర్ 15–21, 22–20, 10–21తో అమ్రి సైనవి–నితా వియోలినా (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నారు.
