కౌలాలంపూర్: ఇండియా డబుల్స్ యంగ్ షట్లర్లు ఎం.ఆర్. అర్జున్–హరిహర్ జోడీ.. మలేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలో సంచలనం సృష్టించింది. మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్‌లో అన్‌సీడెడ్ అర్జున్–హరిహర్ 21–19, 21–15తో ఏడోసీడ్ క్రిస్టో పొపోవ్–టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై సంచలన విజయం సాధించారు.
36 నిమిషాల మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్లు ర్యాలీలు, స్మాష్‌లతో చెలరేగారు. తొలి గేమ్‌లో 10–10తో స్కోరు సమం చేసిన పొపోవ్ బ్రదర్స్ 19–16 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. కానీ పట్టువిడవకుండా పోరాడిన ఇండియన్ ద్వయం వరుస పాయింట్లతో 19–19తో స్కోరు సమం చేశారు. ఆ వెంటనే రెండు బలమైన స్మాష్‌లతో గేమ్ నెగ్గారు.
రెండో గేమ్‌లో 11–11 వరకు హోరాహోరీగా సాగింది. ఇక్కడి నుంచి క్రాస్ కోర్టు విన్నర్లు, ర్యాలీలతో చెలరేగిన అర్జున్–హరిహరన్ స్పష్టమైన ఆధిక్యంతో గేమ్, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. విమెన్స్ డబుల్స్‌లో అశ్విని భట్–శిఖా గౌతమ్ 15–21, 21–17, 17–21తో జాకీ డెంట్–క్రిస్టల్ లాయ్ (కెనడా) చేతిలో ఓడారు. విమెన్స్ సింగిల్స్ క్వాలిఫయర్స్‌లో అష్మితా చాలియా 21–23, 21–16, 21–16తో పాయ్ యుప పో (చైనీస్‌తైపీ)పై నెగ్గి మెయిన్ డ్రాకు అర్హత సాధించింది.
