రైతులు ఆందోళన చెందొద్దు : శరత్ చంద్రారెడ్డి 

రైతులు ఆందోళన చెందొద్దు : శరత్ చంద్రారెడ్డి 

ఘట్ కేసర్, వెలుగు :  రైతులు ఆందోళన చెందొద్దని ప్రభుత్వం ఆదుకుంటుందని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. ఘట్ కేసర్ టౌన్ నారాయణ గార్డెన్ లో మండల రైతు సేవా సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ పాల్గొని మాట్లాడారు.  రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఘట్ కేసర్ సహకార సంఘం రైతులకు విశిష్ట సేవలు అందిస్తూనే లాభాల బాటలో నడుస్తుందన్నారు. రైతులు తీసుకున్న రుణాలను సక్రమంగా కట్టడంతోనే ఆదర్శ సంఘంగా నిలిచిందన్నారు.

 రైతుల ఆర్థిక ప్రయోజనాల కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ పథకాలను అందించడంలో అధికారులు, పాలకవర్గం విఫలమైందని ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, డైరెక్టర్ ధర్మారెడ్డి, రైతులు విమర్శించారు.  రైతులకు ఇచ్చే రుణాల వడ్డీ శాతాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూమి లేకుండా సభ్యత్వం కలిగిన చైర్మన్ రాంరెడ్డి అధికారంలో కొనసాగే హక్కు లేదని డైరెక్టర్ ధర్మారెడ్డి విమర్శించారు.

సంఘం మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ చేసిన నిధుల దుర్వినియోగంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రూల్స్ కు విరుద్ధంగా ఎండీ కరుణాకర్ రూ.1.5 లక్షల ప్రయాణ భత్యం కింద తీసుకున్నాడని, అదేమిటని నిలదీస్తే చెల్లించినట్టు చెప్పారన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి సురేఖ, యూబీఐ ఏజీఏం అరుణాకర్ రెడ్డి, చీఫ్ మేనేజర్ వివేక్, వైస్ చైర్మన్ అనంతరెడ్డి, డైరెక్టర్లు రేసు లక్మారెడ్డి, పోచిరెడ్డి, జడిగే రమేశ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.