మైనంపల్లి రాజీనామాతో...మెదక్ లో మారనున్న సీన్​

మైనంపల్లి రాజీనామాతో...మెదక్ లో  మారనున్న సీన్​

మెదక్, వెలుగు : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. ఆయన కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మెదక్ బీ ఆర్ ఎస్ టికెట్ ఇవ్వనందుకే మైనంపల్లి పార్టీకి గుడ్ బై చెప్పారు.  మల్కాజ్​ గిరి, మెదక్ రెండు టికెట్​లు ఇచ్చేందుకు కాంగ్రెస్​ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ లభించిన తరువాత ఆయన బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో తండ్రి కొడుకులిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది.  రోహిత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెదక్ అసెంబ్లీ స్థానంలో బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ఇది జరిగితే మెదక్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ జరుగనుంది. 

మైనంపల్లి రీఎంట్రీతో మారిన సీను... 

వరుసగా రెండు సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందడటంతో మెదక్​ సెగ్మెంట్​లో పద్మా దేవేందర్​ రెడ్డి తిరుగులేని నాయకురాలిగా ఎదిగారు. సొంత పార్టీలోనూ, ప్రత్యర్థి పార్టీలోనూ బలమైన నాయకులు లేకపోవడంతో రానున్న ఎన్నికల్లోనూ తనకు తిరుగులేదని ఆమె భావించారు. అయితే ఆనూహ్యంగా మైనంపల్లి హన్మంతరావ్​ రీఎంట్రీ ఇవ్వడంతో సీను మారిపోయింది. హన్మంతరావ్ 2009 నుంచి 2014 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పని చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీడీపీ కి రిజైన్ చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడుగా, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అక్కడికే పరిమితం అయ్యారు.

గత ఫిబ్రవరిలో అనూహ్యంగా కొడుకు డాక్టర్ రోహిత్ తో కలిసి భారీ కాన్వాయ్ తో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలకు వచ్చి ప్రత్యేక పూజలు చేసి తన కొడుకు మెదక్ సెగ్మెంట్ లో  సోషల్ సర్వీస్ చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రోహిత్ భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి మెదక్ వచ్చి టౌన్​లో అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు. సోషల్​ సర్వీస్ అని చెప్పినా భారీ ఎత్తున గులాబీ జెండాలు కట్టడం, ముఖ్యమంత్రి కేసీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్​ కేటీఆర్​ ఫొటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల బరిలో తానుంటాననే సంకేతాలు ఇచ్చారు. గత ఏడెనిమిది నెలలుగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు తీర్చడం వంటి పనులు చేపట్టారు. 

కొడుక్కు టికెట్​ఇవ్వకపోవడంతో నారాజ్​

తన కొడుకు రోహిత్ కు మెదక్ స్థానంలో బీఆర్​ఎస్​ టికెట్​ వస్తుందని హన్మంతరావ్​ఆశించగా పార్టీ అధినేత కేసీఆర్​ ప్రకటించిన బీఆర్​ఎస్​ క్యాండిడేట్స్​లిస్ట్​లో తన కొడుకు పేరు లేకపోవడంతో నారాజ్​ అయ్యారు. ఆయనకు మల్కాజిగిరి టికెట్​ఇచ్చినప్పటికి కొడుకుకు మెదక్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్​గా అయినా పోటీ చేస్తామని ప్రకటించారు. మల్కాజిగిరి, మెదక్​ నియోజకవర్గ నాయకులు, ప్రజల అభిప్రాయాలు తీసుకుని తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పిన హన్మంతరావ్, బీఆర్​ఎస్​ పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తుందేమోనని వేచి చూశారు.

అయితే పార్టీ హైకమాండ్​ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు మల్కాజిగిరి, కొడుకు రోహిత్​కు మెదక్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్​ పార్టీ పెద్దల నుంచి హామీ లభించినట్టు తెలిసింది.

మద్దతుదారులు ఆయన వెంటే..

మైనంపల్లి హన్మంతరావ్​, తన కొడుకు రోహిత్​ తో కలిసి త్వరలోనే కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.  ప్రస్తుతం మెదక్​ నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి. సిట్టింగ్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి ఒక వర్గంగా, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి మరో వర్గంగా, మైనంపల్లి హన్మంతరావ్​ది ఇంకోవర్గంగా చెలామణి అవుతున్నాయి. ఇపుడు మైనంపల్లి బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేయడంతో ఇంతకాలంగా ఆయనతో పాటు ఉన్నబీఆర్​ఎస్​ క్యాడర్​ సైతం ఆ పార్టీని వీడి మైనంపల్లి వెంట నడువనున్నారు.

అంతేగాక ప్రస్తుతం ఆయనకు మద్దతిస్తున్నవారే కాకుండా బీఆర్​ఎస్​లో అసంతృప్తితో ఉన్న మరి కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, లీడర్లు సైతం ఆయనకు సపోర్ట్​ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.  మైనంపల్లి రోహిత్​కు పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యాక మెదక్ నియోజకవర్గ రాజకీయాల్లో మరిన్ని మార్పులు జరిగే అవకాశాలున్నాయి