పలు పార్టీల ప్రచారాలతో హోరెత్తుతున్న మల్కాజిగిరి

పలు పార్టీల ప్రచారాలతో హోరెత్తుతున్న మల్కాజిగిరి
  • జోరుగా వివిధ పార్టీల నేతల ప్రచారం
  • టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ రోడ్డు షోలు
  • నేడు ఎల్బీ స్టేడియంలో జనసేన బహిరంగ సభ

హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారాలు, ర్యాలీలు జోరందుకున్నాయి. అన్నిపార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. లోకల్ నాయకులు క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తుంటే, ముఖ్య నేతలు నియోజకవర్గంలోని కీలకమైన ప్రాంతాల్లో రోడ్డు షోలు,బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం  చేసుకునేందుకు చెమటోడ్చుతున్నారు. ఇది దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న లోక్ సభ సెగ్మెం ట్. ఇందులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం మూడు జిల్లాల పరిధిలో ఈ పార్లమెంట్ స్థానం విస్తరించి ఉంది.  ప్రస్తుతం పోటీలో ఉన్నప్రధాన పార్టీల దృష్టంతా మల్కాజిగిరిపైనే  ఉంది. దీంతో పార్టీల ముఖ్య నేతలతో గల్లీగల్లీ తిరుగుతూ మార్నింగ్ వాక్ లు, రోడ్డు షోలూ, సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కులాల సంఘాల ప్రతినిధులు, యువజన సంఘాలను కలుపుకుంటూ ఓట్లు రాబట్టుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ తరఫున ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గా లవారీగా ఆ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే రోడ్డు షో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న ఆ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ముఖ్యకార్యకర్తలు, డివిజన్ స్థా యి నేతలు, కలిసి వచ్చే పార్టీలు, సెటిలర్ల సంఘాల ముఖ్యుల మద్దతు కోరుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఎన్.రామచందర్ రావు పోటీచేస్తున్నారు. పట్టున్న నియోజకవర్గాలలో క్రమం తప్పకుండా ప్రచారం చేస్తూ మోదీ మద్దతుదారులను, యువ ఓటర్లతో ప్రచారం చేస్తున్నారు. తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తుండగా అభ్యర్థి మహేందర్ రెడ్డి ప్రధాన పార్టీల తరహాలతో ప్రచారంలోముందుకు సాగుతున్నారు. కుటుం బ సభ్యులతో కూడా ప్రచారం చేయిస్తూ పోటీ ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.పవన్ కల్యాణ్ అభిమానులను, జనసేన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూనే, సామాజికవర్గాల సమీకరణాలతో ఓట్లు కొల్లగొట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు.

నేటి నుంచి పెరగనున్న హోరు

ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు షోలకు ప్లాన్ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టున్న నియోజకవర్గాలలో కీలక భేటీలతో తనవైపు తిప్పుకునే రేవంత్ ఉన్నారు. 4 నుంచి వరుస రోడ్డు షోలతో ప్రచారంచేయనున్నారు. ముందుగా ఉప్పల్ నియోజకవర్గం లోని ప్రధాన ప్రాంతాలలోరోడ్డు షో మొదలుపెట్టి, మేడ్చల్,మల్కాజిగిరి, కుత్బుల్లా పూర్ వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా సిటీలో కీలకమైన సీట్లు దక్కించుకునేందుకు బీజేపీ ప్రధాని మోదీతో భారీ సభను నిర్వహించింది. 4 తర్వాత జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో రోడ్డు షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.జనసేన అభ్యర్థులకు మద్దతు కోరుతూ గురువారం నాడు ఎల్బీస్టేడియంలో భారీసభ నిర్వహించనున్నారు. అనంతరం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి అభ్యర్థి మహేందర్ రెడ్డి రోడ్డు షో నిర్వహించేలా ప్రచారానికి ప్లాన్ చేసుకున్నారు.