HHVM Review : 'హరి హర వీరమల్లు' అభిమానుల అంచనాలను అందుకుందా?

HHVM Review : 'హరి హర వీరమల్లు' అభిమానుల అంచనాలను అందుకుందా?

ఎన్నో అడ్డంకులు, నిరీక్షణను దాటుకుని ఎట్టకేలకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )  కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు: పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్'  ( Hari Hara Veera Mallu )మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత భారీ అంచనాలతో ఈ మూవీ జూలై 24న విడుదలైన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహన్ని నింపింది.  అసలు విడుదల కూడా కాదని భావించిన తరుణంలో సినిమాను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. చారిత్రక నేపథ్యంతో అద్భుతమైన సాహస గాథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై అంచానాలు భారీగానే ఉన్నాయి . మరి ఇన్ని సంవత్సరాలు ఎదురు చూపిన ఈ వీరమల్లు చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా?..  నిరాశపరిచిందా..? చూద్దాం...

కథా నేపథ్యం
'హరి హర వీరమల్లు ' కథ 17వ శతాబ్దం మధ్యలో సాగుతుంది. ప్రజల ఆశాజ్యోతిగా అణగారిన వారి కోసం పోరాడే వీర మల్లు (పవన్ కళ్యాణ్) కొల్లూరు రాజు దృష్టిని ఆకర్షిస్తాడు. ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (బాబీ డియోల్) ఆధీనంలో ఉన్న అపారమైన కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి ఖుతుబ్ షా వీర మల్లును పంపిస్తాడు. ఈ ప్రయాణంలో పంచమి (నిధి అగర్వాల్)తో కలిసి అతను వజ్రం కోసం అన్వేషణ ప్రారంభిస్తాడు. అయితే, ఈ వజ్రం వేట కేవలం కథలో ఒక చిన్న భాగం మాత్రమే. వీర మల్లుకు ఓ రహస్యమైన గతం, కొన్ని అంతర్గత ఉద్దేశ్యాలు ఉన్నాయి. కథ సాగే కొద్దీ అవి క్రమంగా వెల్లడవుతాయి.  

సినిమాకు బలం చేకూర్చిన అంశాలు
పవన్ కళ్యాణ్ తన పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. వీర మల్లుగా ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆయన యాక్షన్ సన్నివేశాలు ఉత్సాహాన్ని నింపుతాయి, ముఖ్యంగా ధర్మం, న్యాయం గురించి ఆయన పలికే భావోద్వేగ సంభాషణలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలంగా నిలిచింది.  ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఒక పెద్ద ప్లస్ పాయింట్. మచిలీపట్నం రేవులో జరిగే పోరాటం నుండి కొల్లూరులోని భీకర కుస్తీ యుద్ధం వరకు, ప్రతి సన్నివేశం భారీ స్థాయిలో చిత్రీకరించబడింది. రెండవ భాగంలో మొఘల్ సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న గ్రామంలోని పోరాట దృశ్యాలు సినిమాకు వాస్తవికతను జోడించి, ప్రేక్షకులను సీట్లలో నిలబడేలా చేస్తాయి.

సినిమాకు ప్రాణం పోసిన కీరవాణి

ఎం.ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలకు ఆయన సంగీతం గొప్ప అనుభూతినిచ్చిందంటున్నారు ప్రేక్షకులు. సాధారణ సన్నివేశాలకు కూడా నాటకీయతను జోడించి, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. మరో వైపు జ్ఞానశేఖర్ VS ,  మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ చిత్రానికి గొప్ప చారిత్రక వాతావరణాన్ని కల్పించింది. దుస్తులు, సెట్టింగ్‌లు, నిర్మాణ రూపకల్పన 17వ శతాబ్దపు నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాయి.

నిరాశపరిచిన అంశాలు
ఆసక్తికరంగా మొదలైన మొదటి గంట తర్వాత కథనం నెమ్మదిస్తుంది. రెండవ భాగం కథను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బంది పడింది. చాలా వరకు క్లైమాక్స్ , ప్రధాన పాత్రల ఆర్క్‌లు సీక్వెల్‌కు వదిలేయడం వల్ల ప్రస్తుత భాగం అసంపూర్ణంగా అనిపిస్తుందంటున్నారు ప్రేక్షకులు.  మరి ముఖ్యంగా VFX బలహీనంగా ఉన్నాయి. ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించాలని ప్రయత్నించినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నాణ్యత ఆశించిన స్థాయిలో లేదు. భారీ ప్రకృతి దృశ్యాలు , కొన్ని కీలకమైన పోరాట సన్నివేశాలలో VFX లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఇవి సినీ ప్రియులను మరింత నిరాశపరిచేలా ఉన్నాయి. 

ఈ సినిమాలో కొన్ని సన్ని వేశాలు పటిష్టంగా ఆకట్టుకునేలా ఉన్నా.. మరి కొన్ని ఆసక్తిని చంపేస్తాయి. స్క్రీన్ టైమ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ, ఇతర పాత్రలకు తగిన ప్రాధాన్యత లభించలేదు. నిధి అగర్వాల్ పాత్ర ప్రారంభంలో ఆసక్తికరంగా ఉన్నా, క్రమంగా ప్రాముఖ్యత కోల్పోయింది. బాబీ డియోల్ ఔరంగజేబుగా భయానకంగా ఉన్నప్పటికీ, ఆయన స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటం వల్ల ప్రధాన సంఘర్షణ పూర్తిస్థాయిలో లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ పార్ట్ 1 అసంపూర్ణంగా ముగిసిందనే భావనను వెల్లడిస్తున్నారు. 

మొదటి బాగం వరకు ఒకే..
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సృజనాత్మక దృష్టి కథకు గొప్ప ప్రాముఖ్యతను ఇచ్చింది. ఆయన డైరెక్షన్ చేసిన భాగాలు చాలా ఆకట్టుకుంటాయి. తర్వాత జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేయడానికి బాధ్యతలు స్వీకరించారు. చిత్రం సాగదీతగా కొనసాగింది. ఇద్దరు దర్శకుల శైలి మధ్య సమన్వయం లోపించినట్లు స్పష్టమౌతుందని ప్రేక్షకులు అభిప్రాయం  వ్యక్తం చేస్తున్నారు. హరి హర వీర మల్లు ఒక పెద్ద చారిత్రక యాక్షన్ డ్రామాను రూపొందించడానికి చేసిన సాహసోపేతమైన ప్రయత్నం. పవన్ కళ్యాణ్ నటన, బలమైన యాక్షన్ సన్నివేశాలు,  శక్తివంతమైన సౌండ్‌ట్రాక్ సినిమాను నిలబెట్టాయి. అయితే, పేసింగ్ సమస్యలు, నాణ్యత లేని VFX, , అసంపూర్ణమైన పాత్రల ఆర్క్‌ల కారణంగా ఇది తన పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేకపోయింది.  కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను నిరాశపరిచాయని సినీ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి..